ఆస్పత్రి తరలింపు సరికాదు
● వర్ధన్నపేటలోనే
వంద పడకల ఆస్పత్రిని నిర్మించాలి
వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణంలో నిర్మించాల్సిన వంద పడకల ఆస్పత్రిని ఉప్పరపల్లి శివారులో నిర్మించడంపై పట్టణ ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదివారం వర్ధన్నపేట పట్టణంలోని భారతీయ నాటక కళాసమితి ఆడిటోరియంలో పార్టీలకతీతంగా నాయకులు, పట్టణ ప్రముఖులు సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచార సభలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఉప్పరపల్లిలోనే వంద పడకల ఆస్పత్రిని నిర్మిస్తామని ప్రకటించడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 125 సంవత్సరాల సుధీర్గ చరిత్ర ఉన్న వర్ధన్నపేట ఆస్పత్రిని నామరూపాలు లేకుండా చేయడం శోచనీయమన్నారు. వర్ధన్నపేటలో భూమి లేదన్న సాకును చూపొద్దని, ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నాయన్నారు. తాము ఎమ్మెల్యే నాగరాజును కలిసి వివరించినపుడు ఆయన సానుకూలంగా ఉన్నారని, తిరిగి ఎన్నికల ప్రచారంలో ఆయన మాట మార్చడం సరికాదన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలోనే వంద పడకల ఆస్పత్రికి భూమి పూజ చేశారని, ఇందుకు సంబందించిన జీఓ 445 ద్వారా రూ. 26 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. 1896లో నిజాం పరిపాలన కాలంలో చేర్యాల, పరకాలతో పాటు వర్ధన్నపేట తాలుకా కేంద్రంలో మెడికల్ డిస్పెన్సరీ ఏర్పాటైనట్లు చరిత్ర ఉందన్నారు. ఈ ఆస్పత్రి 92 గ్రామాలకు వైద్య సేవలు అందించిన చరిత్ర ఉందన్నారు. ఇప్పటికై న ఎమ్మెల్యే నాగరాజు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆస్పత్రిని తరలించవద్దని, లేదంటే ఈ నెల 12 నుంచి పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు తుమ్మల యాకయ్య, గాడిపెల్లి రాజేశ్వర్‌రావు, కొండేటి సత్యం, ఎండీ అప్సర్, సిలువేరు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.


