పనిమంతులను ఎన్నుకోండి
ఎన్నికల ప్రచారంలో ఎంపీ ఈటల రాజేందర్
కమలాపూర్ : ఎన్నికలంటే ఎమోషన్ అని.. పనిమంతులను ఎన్నుకుంటే ఐదేళ్లు పని చేస్తారని.. మీ కళ్లముందు కదలాడే బిడ్డలకు ఓటు వేయాలని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ అభ్యర్థించారు. కమలాపూర్, భీంపల్లి, కన్నూరు, గుండేడు, మర్రిపల్లిగూడెం, వంగపల్లి, శనిగరం గ్రామాల్లో బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు స్థానాల అభ్యర్థుల తరఫున శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. ‘నేను కమలాపూర్ బిడ్డను.. నన్ను గుర్తు పట్టడానికి కారణం కమలాపూర్ గడ్డ అని, నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదని, అందరి వాడిని’ అని పేర్కొన్నారు. కొందరు డబ్బులిచ్చి ఓట్లు కొంటామంటున్నారట.. అంగట్లో పశువులకు వెల కడతారు.. మనుషుల ఆత్మగౌరవానికి ఎవరూ వెల కట్టలేరని ఆయన ఉద్ఘాటించారు. డబ్బులున్న వారే గెలవాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఠక్కున దిగుతారని.. ఓటుకు రూ.5 వేలు ఇస్తారని.. గెలిచాక మళ్లీ కనిపించరని వివరించారు. హుజూరాబాద్‌ను డల్లాస్ చేస్తా.. కేసీఆర్ తాతతో వందల కోట్లు తీసుకొస్తానంటే.. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోతే మేం చచ్చిపోతామని కొంగుపట్టి అడిగితే ఆడబిడ్డలు కరిగిపోయి ఓట్లేశారని.. అది నటన అని తేలిపోయిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. ఈ ప్రచారంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్ అభ్యర్థులు, ఈటల అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.


