అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ స్నేహ శబరీష్
ఐనవోలు : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులతోపాటు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్నేహశబరీష్ సూచించారు. మండలంలోని పున్నేలు క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన స్టాటిక్ సర్వైలెన్స్ టీం (ఎస్‌ఎస్‌టీ) చెక్ పోస్టును, పంథిని, ఐనవోలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను శనివారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలు, ఎంసీసీ అమలు, వాహనాల పర్యవేక్షణ, అనుమానాస్పద వస్తువుల రవాణా, నివారణపై అధికారులు ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారో కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ప్రతీరోజు వాహనాల తనిఖీ చేపడుతున్నారా? అని అధికారులను ప్రశ్నించారు. అందుకు సంబంధించిన చెక్‌పోస్టు రికార్డులను పరిశీలించారు. సర్పంచ్, వార్డు స్థానాలకు ఏకగ్రీవమైన వారి వివరాలను ఎంపీడీఓ నర్మద, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. విత్‌డ్రా ప్రక్రియ పూర్తి కాగానే వెంటనే గుర్తులు కేటాయించి వివరాలు సాధ్యమైనంత త్వరగా ఎన్నికల అధికారులకు అందజేయాలన్నారు. నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థుల వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విక్రమ్‌కుమార్, ఎంపీఓ రఘుపతిరెడ్డి అధికారులు పాల్గొన్నారు.


