ట్రాఫిక్ ఉల్లంఘనులు
సాక్షి, వరంగల్ : రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలన్న సదుద్దేశంతో వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపే వారితో పాటు ట్రాఫిక్ జంక్షన్ల వద్ద సిగ్నల్ జంపింగ్ చేయడం, అత్యవసర పని ఉందంటూ రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న వారిని నియంత్రించాలన్న ఉద్దేశంతో పోలీసులు కెమెరాలతో క్లిక్‌మనిపిస్తున్నారు. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు 8,99,983 ఈ – చలాన్లు జారీచేసి రూ.25,42,12,482 జరిమానా విధించారు. అయినా కూడా వాహనదారుల్లో ఆశించినంత మార్పు కనిపించకపోవడంతో ఇటీవలి కాలంలో ప్రత్యేక డ్రైవ్‌లతో వాహనదారులకు ఈ – చలాన్ల రూపంలో షాకిస్తున్నారు.
హెల్మెట్ లేకుండానే డ్రైవింగ్
ఉరుకులు.. పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యం భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లిస్తున్న వాహనదారులు కోకొల్లలు ఉన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ లేకపోవడంతో చాలామంది అక్కడికక్కడే మృతిచెందడం, గాయాలు కావడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో మెదడుకు దెబ్బ తగిలిన చోట న్యూరాన్లు నశించడం వల్ల అవయవాలు శాశ్వతంగా చచ్చుబడిపోతున్నాయి. అనేక రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు ఈ ఘటనలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో తలకు ప్రాధాన్యమిచ్చి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని పోలీసులు పదేపదే చెబుతున్నారు. అయితే, ట్రాఫిక్ ఉల్లంఘనుల్లో అత్యధికంగా హెల్మెట్ ధరించనివారే 7,76,740 మంది ఉండడం గమనార్హం. అదే సమయంలో 1,330 మంది పిలియన్ రైడర్ (బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి)లు హెల్మెట్ ధరించలేదని రూ.1,31,800 జరిమానా విధించారు. ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపినవారు, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్‌తో ఉల్లంఘనలు చేస్తున్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అందుకే ట్రాఫిక్ ఉల్లంఘనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ చెబుతున్నారు. అలాగే, రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
వరంగల్ కమిషనరేట్‌లో 10 నెలల్లో 8,99,983 ఈ – చలాన్ల జారీ
వాహనదారులకు రూ.25 కోట్లకుపైగా పోలీసుల జరిమానాలు
ఓవైపు అవగాహన కల్పిస్తూనే
ఇంకోవైపు ఇంటికే ఈ – చలాన్లు
హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన వారు 7,76,740 మంది
ఈ – చలాన్లు, జరిమానాలు ఇలా..
వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో విస్తరించి ఉన్న వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. గత 10 నెలల్లో నమోదైన 8,99,983 ఈ – చలాన్లను పరిశీలిస్తే రోజుకు సగటున 2,999 ఈ – చలాన్లు, నెలకు 89,998 ఈ – చలాన్లను ట్రాఫిక్ పోలీసులు విధించారు. 10 నెలలకు రూ.25,42,12,482 జరిమానా విధించారంటే రోజుకు రూ.8,47,374, నెలకు రూ.2,54,21,248 జరిమానాను వాహనదారులకు విధించినట్టైంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉల్లంఘనలు పెరగడం గమనార్హం.
ట్రాఫిక్ ఉల్లంఘనులు


