సమష్టితత్వంతో చెడు అలవాట్లు దూరం
● న్యాయమూర్తి నిర్మలాగీతాంబ
ఎంజీఎం: గతంలో కుటుంబ వ్యవస్థ సమష్టిగా ఉండటం వల్ల ఆ కుటుంబంలోని సభ్యులు ఎలాంటి చెడు అలవాట్లకు గురికాకుండా చూసుకునేవారని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.సాంబశివరావు ఆధ్వర్యంలో కేఎంసీ గేటు నుంచి ఐఎంఏ హాల్ వరకు సోమవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని న్యాయమూర్తి నిర్మలాగీతాంబ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఐఎంసీ హాల్‌లో ఎయిడ్స్ నిర్మూలనపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ కొంతమంది క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఎయిడ్స్‌కు గురవుతున్నారని తెలిపారు. ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించి ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి తగిన పరీక్షలు, చికిత్సలు అందించి వారు తమతో సమానంగా జీవించడానికి అందరూ సహకరించాలన్నారు. సదస్సులో ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిచందర్ రెడ్డి, సీకేఎం సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి, సీనియర్ వైద్యాధికారి డాక్టర్ సూర్యప్రకాష్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ మోహన్ సింగ్, డాక్టర్ విజయకుమార్, డాక్టర్ ఉదయ్ రాజ్, డాక్టర్ వంశీకృష్ణ, ఐఎంఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ అజీజ్ అహ్మద్, పల్లె దవాఖాన వైద్యాధికారులు, డిప్యూటీ డెమో, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


