వంద పడకల ఆస్పత్రి వర్ధన్నపేటలోనే నిర్మించాలి
● అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం
వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపాలిటీలో నిర్మించాల్సిన వంద పడకల ఆస్పత్రి ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్దకు తరలించవద్దని పార్టీలకతీతంగా పలువురు నాయకులు కోరారు. వర్ధన్నపేటలోనే నిర్మించాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వర్ధన్నపేట పట్టణంలోని భారతీయ నాటక కళాసమితి ఆడిటోరియంలో వర్ధన్నపేట పట్టణ వాసులు పార్టీలకతీతంగా సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ వర్ధన్నపేట పట్టణంలోనే వంద పడకల ఆస్పత్రి నిర్మించాలని ఎమ్మెల్యే నాగరాజు దృష్టికి తీసుకెళ్దామని అన్నారు. సమావేశం అనంతరం హనుమకొండలోని ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు నివాసానికి వర్ధన్నపేట పట్టణవాసులు వెళ్లి ఆయనతో మాట్లాడారు. ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద వంద పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని ఉపసంహరించుకుని వర్ధన్నపేటలోనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.


