
31 వరకు ఇగ్నో అడ్మిషన్ల గడువు
రామన్నపేట: నగరంలోని ఎల్‌బీ కళాశాలలో శుక్రవారం ఇగ్నో టర్మ్ ఎండ్ పరీక్షల నిర్వహణను ఇగ్నో హైదరాబాద్ రీజనల్ సెంటర్ అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 31 వరకు ఇగ్నో(ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ) 2025–26లో అడ్మిషన్లకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. పలు మాస్టర్, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రాంలో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 98493 81085 నంబర్‌లో లేదా www. ignou. ac. inవెబ్‌సైట్ చూడాలని కోరారు.
నేటి నుంచి
తపాలా సేవలు బంద్
ఖిలా వరంగల్: ఈనెల 22 నుంచి తెలంగాణ సర్కిల్ వ్యాప్తంగా నూతన సాఫ్ట్‌వేర్ అమలు చేయనున్నారు. ఈనేపథ్యంలో శనివారం(నేడు) నుంచి 21వ తేదీ వరకు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తపాలా శాఖ సేవలు నిలిపివేయనున్నట్లు వరంగల్ డివిజన్ సూపరింటెండెంట్ రవికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు, సిబ్బంది విధులకు హాజరవుతారని, సేవలు మాత్రం కొనసాగవని చెప్పారు. వినియోగదారులు, ఖాతాదా రులు ఈవిషయం గమనించి సహకరించాలని ఆయన కోరారు.
ఉచిత శిక్షణకు మైనార్టీలు దరఖాస్తు చేసుకోవాలి
న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు బీమా రంగంలో ఉచిత శిక్షణ కమ్ ఎంప్లాయిమెంట్ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కేఏ.గౌస్‌హైదర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈశిక్షణ హైదరాబాద్‌లో నెల పాటు ఉంటుందని, అర్హులైన (ముస్లిం, క్రిస్ట్రియన్, సిక్కు, జైనులు, పార్శి, బౌద్ధుల) మైనార్టీ అభ్యర్థులు సరైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు హనుమకొండ సుబేదారి కలక్టరేట్‌లోని మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయంలో కానీ.. 040–23236112 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ప్రీ పీహెచ్‌డీ పరీక్ష ఫీజు చెల్లించాలి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్స్, కామర్స్‌అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, లా, ఫార్మాస్యూటికల్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగాల పరిశోధకులు ప్రీ పీహెచ్‌డీ పరీక్ష ఫీజు చెల్లింపు నోటిఫికేషన్‌ను శుక్రవారం పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సౌజన్య జారీ చేశారు. అపరాధ రుసుము లేకుండా ఈనెల 30వరకు, రూ.250 అపరాధ రుసుముతో ఆగస్టు 7వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. ఫీజు రూ.930 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
ఎంజీఎం అసిస్టెంట్
డైరెక్టర్ సరెండర్
రిలీవ్ చేయాలంటూ ఎంజీఎం
సూపరింటెండెంట్‌కు ఉత్తర్వులు
ఎంజీఎం: ఉత్తర తెలంగాణలోని పేదలకు వైద్య సేవలందించే ఎంజీఎం ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) ఇస్మాయిల్‌ను సరెండర్ చేస్తూ డీహెచ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్పత్రిలో ఏడీగా విధులు నిర్వర్తిస్తున్న ఇస్మాయిల్ విధుల్లో నిర్లక్ష్యం, ఆస్పత్రిలో పలు విభాగాల ఉద్యోగులతో విబేధాలు ఉన్నట్లు రాష్ట్ర స్థాయి అధికారులు గుర్తించారు. అలాగే ఆస్పత్రి పరిపాలనల్లో కొన్ని సమస్యలు తలెత్తడానికి ఏడీ తీరే కారణమని గుర్తించిన కలెక్టర్ సత్యశారద షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిసింది. ఈవిషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా అనారోగ్య సమస్యలతో సెలవు పెట్టినట్లు ఎంజీఎం పరిపాలనాధికారులు చెబుతున్నారు. కాగా.. సరెండర్ చేసిన ఏడీని రిలీవ్ చేయాలంటూ ఆదేశాలు సైతం ఎంజీఎం సూపరింటెండెంట్‌కు అందడంతో ఆస్పత్రి వర్గాలో ఏడీ సరెండర్ అంశం చర్చనీయాంశంగా మారింది. కాగా.. ప్రస్తుతం ఇన్‌చార్జ్ ఏడీగా కొనసాగుతున్న అధికారి సైతం ఈనెల 23వ తేదీ వరకు సెలవులో ఉండడంతో, కీలక కార్డులపై సంతకాలు చేయకపోవడంతో పెద్దఎత్తున సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. వెంటనే కలెక్టర్ స్పందించి ఇన్‌చార్జ్ ఏడీగా మరో అధికారికి బాధ్యతలు అప్పగించి ఎంజీఎంలో ఏడీ పరిధిలో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.