
కలిసుంటే కలదు సుఖం
ఉమ్మడి కుటుంబాలు.. అనుబంధాల నిలయాలు
● కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా, అండగా..
● మారుతున్న పరిస్థితుల్లో కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నం
నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
దుగ్గొండి: ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధుడి పేరు ములుక దుర్గయ్య. నాచినపల్లి గ్రామానికి చెందిన ఈయనది నిరుపేద కుటుంబం. ఉండేందుకు కనీసం గూడులేని దయనీయ పరిస్థితి. అయినా వెరవలేదు. ఏ పని అయినా అవమానంగా భావించలేదు. దుర్గయ్య–లక్ష్మి దంపతులు తమ కుమారులు రమేశ్, భాస్కర్, నర్సింహారాములు, కరుణాకర్, శంకర్‌ను 10వ తరగతి వరకు చదివించారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఉన్నత చదువులు చదివించలేదు. స్వయం ఉపాధి రంగాల్లో వారిని ప్రోత్సహించారు. దుర్గయ్య మొదట కూలి పనులు చేశాడు. అనంతరం గ్రామాల్లో సైకిల్‌పై తిరుగుతూ బొంబాయి మిఠాయి, ఐస్‌క్రీమ్‌లు, ఉల్లిగడ్డలు విక్రయించాడు. పాత ఇనుప సామాను కూడా కొనుగోలు చేశాడు. గ్రామం నడిబొడ్డున 10 గుంటల ఇంటిస్థలం తీసుకుని ఐదుగురు కుమారులకు ఇళ్లు కట్టించాడు. అయితే, వారందరి ఇళ్లు తన ఇంటి చుట్టూ ఉండేలా నిర్మాణం చేయించాడు. కుమారులు చిరువ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తూ వారి పిల్లలను సైతం ప్రయోజకులను చేశారు. దుర్గయ్యకు చెల్లెళ్లు కనకమ్మ, లలిత ఉన్నారు. కనకమ్మ పెళ్లి చేయగా పుట్టు గుడ్డి అయిన లలితను తన కుమార్తె మాదిరిగా సాకుతున్నాడు. వయస్సు మీదపడినా చెల్లెలు బాధ్యత తానే చూసుకుంటున్నాడు. వీరి ఇంటిలో ఏ పండుగా అయినా అందరూ కలిసి ఒక్కచోటే చేసుకుంటారు. జనాభా ఎక్కువగా ఉండడంతో ఒక శుభకార్యంలా జరుపుకుంటారు. కుటుంబంలో ఏ ఒక్కరికి ఆపద వచ్చినా అందరూ అండగా ఉంటారు. ఇంత మంది ఉన్నా ఒక్కరోజు వీరి ఇంటిలో గొడవలు జరగలేదని గ్రామస్తులు అంటున్నారు. ఒకరిద్దరు పిల్లలు ఉన్న కుటుంబాల్లో నేడు గొడవలు, తల్లిదండ్రులను సాకక పోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. కష్టపడి పెంచిన తల్లిదండ్రులకు ఏనాడూ మచ్చ తెచ్చే విధంగా తాము ప్రవర్తించలేదని కుమారులు అంటున్నారు. ఓ తండ్రి, ఐదుగురు కుమారులు.. వారి పిల్లల కుటుంబాలు.. వీరంతా కలిస్తే శుభకార్యానికి బంధువులే అవసరం లేదు. వీరిది వసుదైక కుటుంబం.. ఆదర్శ కుటుంబం అని చెప్పొచ్చు.
దుగ్గొండి/ఖానాపురం: ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాయి. నానమ్మ, తాత, పెద్దనాన్న, పెద్దమ్మ, చిన్నాన్న, చిన్నమ్మ, అత్తమ్మ, మామయ్య, పిల్లలు.. ఇలా అందరితో కళకళలాడేవి. అందరూ ఒకేసారి భోజనం చేసేవారు. పండుగలు, ఉత్సవాలను ఆనందంగా జరుపుకునేవారు. అనుబంధాలు, ఆప్యాయతలు ఎక్కువగా ఉండేవి. అందరూ కలిసిమెలిసి పనులు చేసేవారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుండేవారు. మారుతున్న పరిస్థితులు, యాంత్రిక జీవనం, పాశ్చాత్య సంస్కృతి, ఉపాధి, ఉద్యోగాల కోసం ప్రస్తుతం అనేక మంది పట్టణాలు, నగరాలకు వలస వెళ్తుండడం, ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండడంతో ఒకరు లేదా ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనేందుకు యువ జంటలు ఇష్టపడడం లేదు. దీంతో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై వ్యక్తి కుటుంబాలు ఏర్పడుతున్నాయి. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
ఓరుగల్లులో తగ్గిన జననాల రేటు
● రాష్ట్ర జననాల సగటులో 13వ స్థానంలో ఉమ్మడి జిల్లా
● 2011 నుంచి జననాల రేటు తగ్గుముఖం...
ఐదేళ్లలో పుట్టింది 70 వేల మందే..
● ఇలాగైతే వచ్చే ఇరవై ఏళ్లలో పెరగనున్న
సీనియర్ సిటిజన్లు
● ఆందోళన కలిగిస్తున్న జననాల సంఖ్య...
– 8లోu

కలిసుంటే కలదు సుఖం