
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
క్షమాదేశ్ పాండే
కమలాపూర్: బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమా దేశ్‌పాండే అన్నారు. కమలాపూర్‌లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో బుధవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. 18 ఏళ్లలోపు బాలికలకు వివాహం చేయడం నేరమని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరూ చట్ట ప్రకారం శిక్షార్హులన్నారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం అర్చక సమాఖ్యలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని పురోహితులు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. వయసు ధ్రువీకరణకు ఆధార్‌కార్డును కాకుండా జనన, మరణ అధికారి, సంబంధిత పాఠశాల హెచ్‌ఎం ఇచ్చిన పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. 18 ఏళ్లలోపు పిల్లలు వాహనాలు నడపకుండా, డ్రగ్స్ బారిన పడకుండా చూడాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సెల్‌ఫోన్ మరొక డ్రగ్‌గా మారిందని, సోషల్ మీడియాతో చాలా మంది నష్టపోతున్నారని, ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వం కేజీబీవీలు, సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు. విద్యార్థులకు నచ్చిన రంగంలో రాణించేలా తల్లిదండ్రులు పోత్సహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యుడు కె.దామోదర్, జిల్లా బాలల పరిరక్షణ ఇన్‌చార్జ్ అధికారి ప్రవీణ్‌కుమార్, సఖి వన్‌స్టాప్ సెంటర్ అడ్మిన్ హైమావతి, కేజీబీవీ ఎస్‌ఓ అర్చన తదితరులు పాల్గొన్నారు.