
యూరియా కోసం ఎగబడిన రైతులు
● లైన్‌లో నిలబడి తోపులాట
● పోలీసుల పహారాలో పంపిణీ
కమలాపూర్: మండలంలోని శనిగరంలో బుధవారం రైతులు యూరియా కోసం ఎగబడ్డారు. దీంతో పోలీసుల పహారాలో యూరియా పంపిణీ చేశారు. శనిగరంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి బుధవారం 444 బస్తాల యూ రియా రాగా.. సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయాన్నే పెద్ద ఎత్తున పీఏసీఎస్ వద్ద బారులుదీరారు. యూరియా పంపిణీ సమయంలో ఒక్కసారిగా ఎగబడి తోపులాడుకున్నారు. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ ఎస్సై మధు, సిబ్బందితో కలిసి హుటాహుటిన అక్కడికు చేరుకుని రైతులను క్యూలైన్లో నిల్చోబెట్టి ఒక్కొక్కరికి 3 బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేయించారు. అయినప్పటికీ రైతులందరికీ యూరియా బస్తాలు సరిపడకపోవడంతో కొందరు రైతులు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. రైతులకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా బస్తాల కోసం క్యూలైన్లలో చెప్పులు పెట్టాల్సి వచ్చిందని, ఇప్పుడు మళ్లీ యూరియా బస్తాల కోసం వ్యవసాయ పనులన్నీ వదులుకుని కుటుంబ సమేతంగా క్యూలైన్లో నిల్చోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని కోరుతున్నారు.