
వేతనాలు రాక వెతలు
ఉపాధి హామీ పథకం సిబ్బందికి మూడు నెలలుగా అందని జీతాలు
ఖానాపురం: గ్రామాల్లో వలసలను నివారించి కూలీలకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా కూలీలకు 100 రోజులపాటు పనులు కల్పించడంలో ఎఫ్‌ఏ (ఫీల్డ్ అసిస్టెంట్లు)ల పాత్ర కీలకం. కానీ, వేతనాలు సకాలంలో రాకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీరితోపాటు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఇతర సిబ్బందికి సైతం నెలనెలా వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న 11 గ్రామీణ మండలాల పరిధిలో 74 వేల జాబ్‌కార్డులు ఉన్నాయి. 1.25 లక్షల మంది కూలీలు ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్నారు. కూలీలకు గ్రామీణ ప్రాంతాల్లో పనులు కల్పించడానికి జిల్లా వ్యాప్తంగా 163 మంది ఫీల్డ్‌అసిస్టెంట్లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారు. వీరితో పాటు 40 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 29 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 10 మంది ఈసీలు, 10 మంది ఏపీఓలు మొత్తం 252 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా గ్రామాల్లో సంవత్సరానికి సరిపడా ఉపాధి పనులు గుర్తించి జాబ్‌కార్డులు కలిగిన కూలీలకు పనులు కల్పిస్తున్నారు. టెక్నికల్ అసిస్టెంట్లు నూతనంగా గుర్తించిన పనులకు అంచనాలు వేయడం, పని ప్రదేశాల్లో కొలతలు వేయడం, రికార్డుల నిర్వహణ వంటి విధులు నిర్వర్తిస్తారు. కంప్యూటర్ ఆపరేటర్లు ఆన్‌లైన్‌లో మస్టర్లు పొందుపర్చడం, ఎఫ్‌ఏలకు మస్టర్లు ఇవ్వడం, నిధుల జనరేట్ చేయడం వంటి పనులు చేస్తుంటారు. ఈసీలు, ఏపీఓలు ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తారు.
భారమవుతున్న కుటుంబ పోషణ..
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఎఫ్‌ఏలు, ఇతర ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎఫ్‌ఏలు కూలీలకు పనులు తప్పనిసరిగా కల్పించాల్సి ఉంటుంది. దీంతో ఎఫ్‌ఏలు ఇతర పనులు చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. వీరితోపాటు ఇతర ఉద్యోగులు సైతం నిత్యం కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. వేతనాలు రాకపోవడంతో దుర్భర జీవితాలు గడుపుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణ సైతం భారంగా మారుతోందని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వేతనాలు చెల్లించాలని ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలు, ఏపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్లు కోరుతున్నారు.
ఎఫ్‌ఏలు, టీఏలు, ఈసీలు, ఏపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్ల ఇబ్బందులు
జిల్లా సమాచారం
గ్రామీణ మండలాలు : 11
పనిచేస్తున్న ఉద్యోగులు : 252 మంది
జాబ్‌కార్డుల సంఖ్య : 74 వేలు
కూలీల సంఖ్య : 1.25 లక్షలు

వేతనాలు రాక వెతలు