
కదం తొక్కిన కార్మికులు
నర్సంపేట: జిల్లాలో కార్మిక లోకం కదం తొక్కింది. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా వరంగల్ నగరంతోపాటు నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లో కార్మిక సంఘాల నాయకులు బుధవారం నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. నర్సంపేటలో సీఐ టీయూ, బీఆర్‌టీయూ, ఏఐటీయూసీ, ఏఐఎఫ్ టీయూ న్యూ, ఐఎఫ్‌టీయూ, టీయూసీఐ నాయకులు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం సవరించడం సరికాదని పేర్కొన్నారు. రోజుకు 8 గంటల పని విధానానికి స్వస్తి పలికి 10 గంటలు పనిచేయాలని చెప్పడం కార్మికవర్గాన్ని శ్రమదోపిడీకి గురి చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మెకు సీపీఎం, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. ఏఐఎఫ్‌టీయూ న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మోడెం మల్లేశం, బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఈసంపల్లి బాబు, ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి గుంపెల్లి మునీశ్వర్, సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పంజాల రమేశ్, హమాలీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్షీనారాయణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేశ్, ఆశ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు లలిత, మున్సిపల్ వర్కర్స్ యూని యన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు గడ్డం సమ్మయ్య, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు హనుమకొండ శ్రీధర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా సమ్మయ్య, డీవైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
అసంఘటిత కార్మికులకు చట్టం చేయాలని డిమాండ్