
మల్లన్న సన్నిధిలో తొలి ఏకాదశి పూజలు
ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి సన్నిధిలో తొలి ఏకాదశి పూజలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారి మేలు కొలుపుతో ప్రారంభం కాగా.. మహాగణపతి పూజ, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు. ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మతో ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు ఉప్పుగల్లులోని ఆకేరు వాగు నుంచి వేద మంత్రోచ్ఛరణల మధ్య కొత్త నీరు తీసుకొచ్చి స్వామివారిని అభిషేకించారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రామస్తులు బిందెలతో కొత్తనీరు తీసుకొచ్చి లింగాకారుడికి సహస్త్ర ఘటాభిషేకం జరిపించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సుభిక్షంగా పండాలని దేవుడిని ప్రార్థించారు. కాగా, అర్చకులు మల్లన్న ఉపాలయంలో భ్రమరాంబిక అమ్మవారిని కూరగాయలతో శాకంబరీగా అలంకరించారు.