
గార్బేజ్ చార్జెస్ సవరణ
వరంగల్ అర్బన్: నగరంలో గార్బేజ్ (చెత్త) చార్జీలను పక్కాగా వసూలు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఆరేళ్ల క్రితం నిర్ణయించిన ధరల సవరణకు రంగం సిద్ధమైంది. ‘మామూళ్ల మత్తు, కమర్షియల్ నుంచి కాసుల పంట’ శీర్షికన సాక్షిలో జూన్ 30న ప్రచురితమైన కథనానికి పాలకవర్గం, అధికారులు స్పందించారు. సోమవారం గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశంలో గార్బేజ్ చార్జీల సవరణను ప్రవేశపెట్టేందుకు ఎజెండాలో చేర్చారు.
గార్బేజ్ చార్జీలు మూడు స్లాబ్‌లుగా ..
● నివాస, పాక్షిక నివాస గృహాలకు గార్బేజ్ చార్జీలుగా ప్రతి నెలకు 0 నుంచి 1,500 ఫీట్ల వరకు రూ.60 కాగా, 1,501 నుంచి 2,500 వరకు రూ.100 ఉండగా, 25,01 నుంచి 3,500 వరకు రూ.120, 3,500 నుంచి 10 లక్షల ఫీట్ల వరకు రూ.150గా నిర్ణయించారు.
● నివాసేతర (కమర్షియల్, ఇండస్ట్రీయల్) భవనాలకు 0 నుంచి 1,000 ఫీట్ల వరకు రూ.80 కాగా, 1,001 నుంచి 1,500 వరకు రూ.100 ఉంది. 1,501 నుంచి 2,500 వరకు రూ.120 ఇక 2,501 నుంచి ఆపై రూ.180 వరకు వసూలు చేయాలని నిర్ణయించారు.