
దీప్తా, కులసుందరి క్రమాల్లో అమ్మవారికి పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం తొమ్మిదో రోజు అమ్మవారిని దీప్తా, కులసుందరి క్రమాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, నిత్యాహ్నికం నిర్వహించి, అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపన భేరాన్ని దీప్తామాతగా, షోడశీ క్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని కులసుందరిగా అలంకరించి పూజలు చేశారు. శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ శేషుభారతి, సిబ్బంది, ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
దొడ్డి కొమురయ్యకు నివాళి
న్యూశాయంపేట: తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతిని కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, కురుమ సంఘం ప్రతినిధులు పాల్గొని దొడ్డి కొంరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దొడ్డి కొమురయ్య సామాజిక న్యాయం కోసం పోరాడారని వారు కొనియాడారు. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి పుష్పలత పాల్గొన్నారు.
మాజీ సీఎం రోశయ్య జయంతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య జయంతి ని శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి కలెక్టర్, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మొబైల్ షాపు,
టీ స్టాల్‌లో చోరీ
నర్సంపేట: మొబైల్ షాపు, టీ స్టాల్‌లో చోరీ జరిగిన సంఘటన చెన్నారావుపేట మండలంలోని మగ్థుంపురం గ్రామ శివారులో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కోట రాజు చెన్నారావుపేట–నెక్కొండ ప్రధాన రహదారిలో ఉన్న జయముఖి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఆర్‌కే సెల్ షాపు నిర్వహిస్తున్నాడు. మగ్ధుంపురం తండాకు చెందిన మాలోతు బేబిరాణి మణికంఠ టీ స్టాల్ నిర్వహిస్తోంది. రోజూ మాదిరిగానే గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపులను నడుపుకొని తాళాలు వేసి వారు ఇళ్లకు వెళ్లారు. అర్ధరాత్రి వేళ దుండగులు గడ్డపారతో తాళాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. సెల్‌షాపులో సుమారు రూ.30 వేల విలువ చేసే స్పీకర్ బాక్స్‌లు, పౌచులు, బ్లూటూత్‌లు, చార్జర్లు, చార్జింగ్ కేబుల్స్, సెల్‌ఫోన్లకు వాడే గ్లాసులు, టీ స్టాల్‌లో రూ.40 వేల విలువ చేసే వివిధ సిగరెట్ బాక్సులు, కూల్‌డ్రింక్స్ అపహరించుకుకెళ్లారు. శుక్రవారం ఉదయం షాపులకు వచ్చి చూసే సరికి చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రాజేశ్‌రెడ్డి పోలీసు సిబ్బందితో చేరుకొని షాపులను పరిశీలించారు. అలాగే, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం అధికారులు వేలిముద్ర నమూనాలను సేకరించారు.
పోక్సో కేసులో
నిందితుడి అరెస్ట్
గీసుకొండ: మండలంలోని ఓ గ్రామానికి చెంది బాలికపై లైంగిక దాడి చేసిన అదే గ్రామానికి చెందిన యువకుడు కొమ్ముల లిటిల్‌ను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గీసుకొండ సీఐ మహేందర్ తెలిపారు. సదరు బాలికను బలవంతంగా తన బైక్‌పై గ్రామ శివారుకు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడని, ఆ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఇటీవల కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. అతడి నుంచి బైక్‌తోపాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు.

దీప్తా, కులసుందరి క్రమాల్లో అమ్మవారికి పూజలు