రోజుకు తొమ్మిది గంటలు | Sakshi
Sakshi News home page

రోజుకు తొమ్మిది గంటలు

Published Thu, Apr 18 2024 9:30 AM

కౌశిక్‌కు స్వీట్‌ తినిపిస్తున్న తల్లిదండ్రులు   - Sakshi

కోచింగ్‌ లేకుండా సివిల్స్‌ ర్యాంకు సాధించిన కౌశిక్‌

జనగామ: రోజుకు తొమ్మిది గంటలు.. రెండేళ్ల కఠోర శ్రమ.. కోచింగ్‌ లేకుండా స్వశక్తితో ప్రిపరేషన్‌.. సీనియర్ల సలహాలు, సూచనలతో సివిల్స్‌లో ఆలిండియా 82వ ర్యాంకు సాధించిన మెరుగు కౌశిక్‌ నేటితరం యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. జనగామ పట్టణానికి చెందిన కౌశిక్‌ ర్యాంకు సాధించిన తర్వాత మొదటిసారి బుధవారం జిల్లా కేంద్రానికి రాగా.. స్నేహితులు, బంధువులు అతడికి ఘన స్వాగతం పలికి అభినందనలతో ముంచెత్తారు. విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు, స్నేహితులు సత్కరించి ఆశీస్సులు అందించారు.

పలువురి సత్కారం..

సివిల్స్‌ ర్యాంకర్‌ కౌశిక్‌ను జిల్లా ఆస్పతుల సమన్వయకర్త డాక్టర్‌ సుగుణాకర్‌రాజు, కౌన్సిలర్‌ సుధ తదితరులు సత్కరించారు. అలాగే బాలాజీనగర్‌ రేణుకాఎల్లమ్మ ఆలయ కాలనీవాసులతోపాటు సురుగు సుధాకర్‌ గౌడ్‌, రాజు, ముస్త్యాల దయాకర్‌, ఉల్లుంగుల సందీప్‌, తిప్పారపు విజయ్‌, సతీష్‌, అఓపా జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ గంగిశెట్టి ప్రమోద్‌కుమార్‌, ఐవీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బిజ్జల నవీన్‌కుమార్‌, వాసవీ క్లబ్‌ గ్రేటర్‌ పట్టణ అధ్యక్షుడు పడకంటి రవీందర్‌, మదరపు రాజు తదితరులు అభినందించి సన్మానించారు.

కౌశిక్‌ పట్టుదల స్ఫూర్తిదాయకం :

ఎమ్మెల్యే ‘పల్లా’

కోచింగ్‌ లేకుండా.. స్వశక్తితో సివిల్స్‌లో 82వ ర్యాంకు సాధించడం మామూలు విషయం కాదు.. కౌశిక్‌ పట్టుదల యువతకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సతీమణి నీలిమ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పి.జమునతో కలిసి ఆయన కౌశిక్‌ను సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ మంచి అడ్మినిస్ట్రేటివ్‌ స్కిల్స్‌తో జనగామ పేరు ప్రతిష్టలను నిలబెట్టాలని ఆకాంక్షించారు.

రెండేళ్ల కఠోర శ్రమకు ఫలితం..

82వ ర్యాంకు

ఏడాది పాటు కన్సల్టెన్సీగా ఉద్యోగం

అభినందనలతో ముంచెత్తిన

స్నేహితులు, బంధువులు

జనగామ పేరు నిలబెడతా..

– ‘సాక్షి’తో సివిల్స్‌ ర్యాంకర్‌ కౌశిక్‌

ఉస్మానియా వర్సిటీలో సివిల్‌ ఇంజీనిరింగ్‌ పూర్తయిన తర్వాత ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌లో ఎంబీఏ చదివాను. తర్వాత కన్సట్టెంట్‌గా ఏడాదిపాటు ఉద్యోగం చేశాను. సివిల్స్‌కు ప్రిపేర్‌ కావడానికి ఉద్యోగం మానేశాను. 2022 నుంచి రెండు షిఫ్టుల్లో రోజుకు తొమ్మిది గంటల పాటు ప్రిపేర్‌ అయ్యాను. యూట్యూబ్‌లో వచ్చే స్టాండర్డ్‌ బుక్స్‌ను మల్టీపుల్‌గా చూసుకుంటూ.. సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకున్నా. ఆన్సర్‌ రేటింగ్‌ కోసం తరచూ టెస్ట్‌ సిరీస్‌ రాయడం, డౌట్స్‌ ఎప్పటికప్పుడు క్లియర్‌ చేసుకుని తప్పులను సరిచేసుకోవడం వల్ల ఈ ర్యాంకు సాధించగలిగా. మాక్‌ ఇంటర్వ్యూలు కలిసొచ్చాయి. గతంలో సివిల్స్‌ ఎంట్రెన్స్‌ల్లో వచ్చిన ప్రశ్నలను ఒకటికి రెండు సార్లు రిమైండ్‌ చేసుకున్నా. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఐఏఎస్‌ సాధించగలిగా. పుట్టిన ఊరు, ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని మరువలేను. జనగామ పేరు నిలబెడతా.

1/1

Advertisement
 
Advertisement
 
Advertisement