టూరిజం కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం | Sakshi
Sakshi News home page

టూరిజం కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

Published Tue, Apr 16 2024 1:00 AM

- - Sakshi

హన్మకొండ: హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (నిథమ్‌)లో టూరిజం కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఆమోదిత కళాశాల నిథమ్‌లో ఇంటర్‌, డిగ్రీలో బీఎస్సీ, బీబీఏ, ఎంబీఏ కోర్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోర్సులు పూర్తి చేసిన అనంతరం విద్యార్థులకు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు ఉంటాయని, దేశంలోని హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉపాధి అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. జాతీయ స్థాయి విద్యా విధానంతో నిథమ్‌ ఉన్నత ప్రమాణాలతో కోర్సులు అందిస్తుందని పేర్కొన్నారు. అడ్మిషన్‌, ఇతర వివరాలకు హనుమకొండ కలెక్టరేట్‌లోని జిల్లా పర్యాటక శాఖ కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్చని, లేదా పూర్తి వివరాలకు 94408 16076, 98669 19131 నంబర్‌లకు ఫోన్‌ చేయాలని సూచించారు.

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

కేయూ క్యాంపస్‌: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల 2, 4, 6 సెమిస్టర్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. ఈ పరీక్షల నిర్వహణ తీరును ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎస్‌.జ్యోతి పర్యవేక్షించారు. మే 8 వరకు పరీక్షలు కొనసాగుతాయి.

మే1 నుంచి వేసవి

క్రీడా శిబిరాలు

వరంగల్‌ స్పోర్ట్స్‌: తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాలతో మే 1 నుంచి 31 వరకు హనుమకొండ జిల్లా పరిధి గ్రామీణ క్రీడా ప్రాంతాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్‌ఓ అశోక్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల రోజుల పాటు శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు పీడీ, పీఈటీ, సీనియర్‌ క్రీడాకారులు అర్హులుగా పేర్కొన్నా రు. శిబిరాల నిర్వహణకు ఆసక్తి అర్హత కలిగిన వారు ఈనెల 16 నుంచి 23వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నెల రోజుల పాటు కొనసాగే ఈశిబిరంలో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతంలో జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో డీఎస్‌ఏ కోచ్‌ల ద్వారా శిక్షణ శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. వేసవి సెలవులను వృథా చేయకుండా వివిధ క్రీడాంశాల్లో శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి కలిగిన బాలబాలికలు ఈ నెల 16 నుంచి 25వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు హనుమకొండలోని ఇండోర్‌ స్టేడియంలోని డీఎస్‌ఏ ఆఫీస్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. పేర్ల నమోదుకు ఆధార్‌ కార్డు, బోనోఫైడ్‌ సర్టిఫికెట్‌ జిరాక్స్‌లను తీసుకురావాలని సూచించారు. ఇతర వివరాలకు అథ్లెట్‌ కోచ్‌ 94410 86556 మొబైల్‌ నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

ఎస్‌ఏ–2 పరీక్షలు షురూ

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ (ఏస్‌ఏ–2) పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. 1 నుంచి 9వతగతి విద్యార్థులకు తొలి రోజు తెలుగు, ఉర్దూ సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించారు. జిల్లా విద్యా శాఖ క్వాలిటీ కో–ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ రాంపూర్‌లోని హైస్కూల్‌లో నిర్వహిస్తున్న పరీక్షలను పరిశీలించారు. ఈనెల 22 వరకు పరీక్షలు జరుగుతాయని సంబంధిత అధికారులు తెలిపారు.

30 క్వింటాళ్ల

రేషన్‌ బియ్యం పట్టివేత

కమలాపూర్‌: కమలాపూర్‌ మండలం అంబాలలో రెండు ఇళ్లల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 30 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని సోమవారం పోలీసులు పట్టుకున్నారు. అంబాలకు చెందిన బోయిని శ్రీనివాస్‌, బోయిని ఐలుస్వామి తమ ఇళ్లల్లో అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని నిల్వ చేసి ఉంచారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఇద్దరి ఇళ్లల్లో 15 క్వింటాళ్ల చొప్పున బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ హరికృష్ణ తెలిపారు. ఈదాడుల్లో ఎస్సై వీరభద్రరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

1/1

Advertisement
 
Advertisement
 
Advertisement