తొలి విడత పోలింగ్‌కు తగిన ఏర్పాట్లు
గోపాల్‌పేట: గ్రామపంచాయతీ మొదటివిడత ఎన్నికలు జరిగే గోపాల్‌పేట, ఏదుల, రేవల్లి మండలాల్లో పోలింగ్ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 8వ తేదీన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను సజావుగా నిర్వహించాలని సూచించారు. తుది జాబితాలో పోటీలో నిలిచిన అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను తెలిపారా లేదా.. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు ఎంతమంది ఉన్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. పోస్టల్ ఓటు వేసే పోలింగ్ సిబ్బంది నుంచి ఫారం–17 డ్యూటీ ఆర్డర్ కాపీ చూసి బ్యాలెట్ పత్రం ఇవ్వాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ వెనక రిటర్నింగ్ అధికారి సంతకం తప్పనిసరిగా ఉండాలని, లేదంటే ఓటు చెల్లుబాటు కాదని చెప్పారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఎంపీడీఓ అయేశా అజుం, తహసీల్దార్ తిలక్‌కుమార్‌రెడ్డి, ఎంపీఓ భవాని తదితరులు ఉన్నారు.
ఈవీఎం గోదాంకు పకడ్బందీ భద్రత
వనపర్తి: ఈవీఎం గోదాంకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న ఈవీఎం గోదాం భద్రతను రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, పోలీస్ బందోబస్తు, విధుల నిర్వహణపై ఆరా తీశారు. వారి వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు పెద్దిరాజు, కొత్తపల్లి శంకర్, కుమారస్వామి, ఎన్.త్రినాథ్, పరమేశ్వరాచారి, జమీల్ తదితరులు పాల్గొన్నారు.


