యథేచ్ఛగా గ్రావెల్‌ తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా గ్రావెల్‌ తవ్వకాలు

Apr 30 2026 9:36 AM | Updated on Apr 30 2026 9:36 AM

యథేచ్ఛగా గ్రావెల్‌ తవ్వకాలు ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

బొండపల్లి: మండల కేంద్రం బొండపల్లిలో కొద్ది రోజులుగా చెరువులో గ్రావెల్‌ను అభివృద్ధి పనుల ముసుగులో అక్రమంగా తరలించుకుపోతున్నారు. గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొత్త చెరువులో రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండానే వందలాది ట్రాక్టర్ల గ్రావెల్‌ను రాత్రి పూట యథేచ్ఛగా తరలిస్తున్నారు. గ్రావెల్‌ను ఇళ్ల నిర్మాణంలో ఖాళీ స్థలాలను ఎత్తు చేసుకునేందుకు, పశువుల శాలలు ఖాళీ స్థలాలను ఎత్తు చేసేందుకు అక్రమంగా తరలించుకుపోతున్నారు. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వదిలేయడంతో వారి అక్రమాలకు అంతు లేకుండా పోతోంది. చెరువుల్లో గ్రావెల్‌ తవ్వాలంటే రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు, మైన్స్‌ అధికారుల అనుమతులు తీసుకున్న తర్వాత వారు సూచించిన మోత్తాన్ని ప్రభుత్వానికి జమ చేసి తరలించాల్సి ఉంది. మరో వైపు వాల్టా చట్టం నిబంధనలకు లోబడి తరలించాలి. ఈ నిబంధనలు అన్ని గాలికి వదిలేసి ప్రభుత్వ రోడ్డు పనులు, అభివృద్ధి పనుల పేరుతో గ్రావెల్‌ను తరలిస్తూ పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రావెల్‌ అక్రమ తవ్వకాలపై ఇటీవల బొండపల్లిలో జరిగిన గ్రామ సభలో పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అధికారుల ముందు బాహాటంగానే నిలదీసినప్పటికీ చర్యలు మాత్రం శూన్యం.

డెంకాడ: మండలంలోని చింతలవలస ఐదవ ఏపీఎస్‌పీ బెటాలియన్‌లో ఉన్న ఎస్‌వీఎస్‌ ఏపీఎస్‌పీ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బెటాలియన్‌ కమాండెంట్‌ వై.రవిశంకర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నర్సరీ, యూకేజీ తరగతులకు ఒక పోస్టు, 1నుంచి 5వ తరగతి బోధించేందుకు ఇంటర్‌, బీఏ, బీఎస్సీలతో పాటు టీపీటీ, హెచ్‌పీటీ, డీఈడీల అర్హత కలిగిన వారితో 4 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని వివరించారు. 6నుంచి 10వ తరగతి వరకూ హిందీ బోధించేందుకు బీఏతో పాటు హిందీ పండిట్‌ విద్యార్హత అని తెలిపారు. కంప్యూటర్‌ తరగతులు బోధించేందుకు 1 ఉపాధ్యాయ పోస్టు ఉందని, దీనికి బీసీఏ, బీఎస్సీ, బీఈ, బిటెక్‌ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. దరఖాస్తులను rvremschool@gmail.com గాని, వాట్సాప్‌ నంబర్‌ 73282234573కు గానీ పంపగలరన్నారు. అడ్మినిస్ట్రేషన్‌ 9573184185, స్కూల్‌ కాంటాక్ట్‌ నంబర్‌ 7382234573, బీడబ్ల్యూ అధికారి ఎన్‌.గణేష్‌ 9440906345కు ఫోన్‌ చేసి మరింత సమాచారం కోసం సంప్రదించాలని సూచించారు.

అభివృద్ధి పనుల ముసుగులో తరలింపు

Advertisement
 
Advertisement
Advertisement