ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించాలి
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం ఫోర్ట్: హెచ్‌ఐవీ/ఎయిడ్స్ పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ నియంత్రణ దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్టీసీ కాంపెక్స్ నుంచి సోమవారం నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎయిడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండేందుకు నిరంతరం అవగాహన కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎయిడ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎయిడ్స్/హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకూడదని హితవు పలికారు. వారు కూడా సమాజంలో భాగమేనన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణ ప్రసాద్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్. జీవనరాణి, డీఎల్‌ఓ డాక్టర్ కె.రాణి, సెట్విజ్ సీఈఓ వి.విశ్వేశ్వరరావు, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ ప్రసాదరావు, నేచర్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


