సకాలంలో వినతుల పరిష్కారం
● కలెక్టర్ డాక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: జిల్లాలో ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు పీజీఆర్‌ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెవెన్స్ సిస్టమ్)ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అందుకు సంబంధించిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి ప్రజలు విశేషంగా స్పందించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ప్రజల నుంచి 201 వినతులను స్వీకరించారు. ప్రతి అర్జీదారుతో మాట్లాడి, వారి సమస్యలను శ్రద్ధగా విని వెంటనే సంబంధిత అధికారులకు పరిష్కార సూచనలు జారీ చేశారు. విభాగాల వారీగా స్వీకరించిన వినతులలో అత్యధికంగా రెవెన్యూశాఖకు 73, మిగిలిన వాటిలో డీఆర్‌డీఏ 32, గ్రామ సచివాలయం 12, మున్సిపాలిటీ 6, పంచాయతీరాజ్ 10, విద్యుత్ శాఖ 3, వైద్య ఆరోగ్యశాఖ 2, హౌసింగ్ 7, ఇతర శాఖలు మరో 50 అర్జీలు ఉన్నాయి. ఫిర్యాదులపై చర్యల విషయంలో అర్జీదారులతో మాట్లాడిన తేదీ, సమయాన్ని తప్పకుండా పోర్టల్‌లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మురళి, డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీల గాంధీ, బి.శాంతి, కళావతి, సర్వే శాఖ ఎ.డి ఆర్.విజయకుమార్, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవీప్రసాద్, సీపీఓ బాలాజీ, డీఈఓ మాణిక్యంనాయుడు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అర్జీలు పునరావృతం కారాదు: కలెక్టర్ ప్రభాకరరెడ్డి
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో అందిన అర్జీలు ఎట్టిపరిస్థితుల్లో కూడా పునరావృతం కారాదని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు 69 వినతులు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును శ్రద్ధతో పరిశీలించి ప్రజలకు సంతృప్తి కలిగే విధంగా నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. పరిష్కారంలో జాప్యం వహించరాదని స్పష్టం చేశారు. అధికారులు చిత్తశుద్ధితో సమస్యలను పరిష్కరించి ప్రజల మన్ననలను పొందాలని సూచించారు. ఒకవేళ అర్జీలు పరిష్కారం కాకపోతే అందుకు గల కారణాలను అర్జీదారులకు వివరించాలని కెప్పారు. అర్జీలను స్వీకరించినవారిలో డీఆర్‌ఓ కె.హేమలత, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సకాలంలో వినతుల పరిష్కారం


