కుష్ఠు వ్యాధిని నయంచేయొచ్చు
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
విజయనగరం ఫోర్ట్: కుష్ఠు... నయం చేయగల వ్యాధి అని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అన్నారు. కుష్ఠు వ్యాధిసోకిన వారిని సమాజం చిన్నచూపు చూస్తుందన్న అపోహను విడనాడితే సమాజం నుంచి కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో శనివారం కుష్ఠు వ్యాధిపై రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలో కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. చర్మంపై తెల్లటి మచ్చలు, ఎర్రటి వాపు, గడ్డలు, సున్నితత్వం కోల్పోవడం వంటి లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రందించాలన్నారు. అన్ని పాఠశాలలు, వసతి గృహాల్లో అవగాహనతో పాటు పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ మాణిక్యం నాయుడును ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కె.రాణి, జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, ఐసీడీఎస్ పీడీ విమలరాణి, డీపీఎం డాక్టర్ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


