శరవేగంగా పైడితల్లి అభివృద్ధి పనులు
విజయనగరం టౌన్: సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం విస్తరణ బాలాలయం నిర్మాణ పనులతో ప్రారంభమయ్యాయి. ఆలయం పక్కన ఉన్న ఆధ్యాత్మిక కళావేదిక వద్ద ఉన్న ఖాళీ స్థలంలో అమ్మవారి బాలాలయం పనులను దాతల సహకారంతో అధికారులు ముందుగా నిర్మాణం చేపట్టారు. నవంబరు నెలలో పనులు పూర్తయిన తర్వాత అక్కడ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అక్కడ నుంచి ఆలయ అంతరాలయం, క్యూ వచ్చే ఇరువైపులా గోడలను పూర్తిగా తీసివేసి పొడవు, వెడల్పులను పెంచి నిర్మాణం చేపట్టేందుకు దేవదాయ శాఖ రంగం సిద్ధం చేసింది. సుమారు కోటీ రూ.80 లక్షలతో చేపట్టే ఈ నిర్మాణ పనులను వచ్చే ఏడాది జాతర నాటికి పూర్తి వైభవం సంతరించుకోనుంది. గతంలో అమ్మవారి చదురుగుడికి ఎదురుగా ఉన్న 2618 చదరపు గజాల ఎడ్వర్డ్ ఆసుపత్రి స్థలాన్ని మున్సిపాలిటీ నుంచి కోటీ రూ.19 లక్షలతో దేవదాయ శాఖ కొనుగోలు చేసింది. ఆ ప్రదేశాన్ని పూర్తిగా చదును చేయించి, ఆలయానికి ఇరువైపులా ఉన్న షాపుల యజమానులతో సంప్రదింపులు చేసి వారికి ఆ స్ధలాన్ని అప్పగించిన సంగతి విదితమే. మొత్తం తొమ్మిది షాపుల వరకూ తొలగించి వారి నుంచి 3,130 గజాల స్ధలాన్ని సేకరించారు. సుమారు రూ.5 కోట్ల వరకూ తొమ్మిది మందికి భవన పరిహారం కింద చెల్లించారు. మరో 230 గజాల స్థలం సేకరించేందుకు ప్రపోజల్స్‌ను ఉన్నతాధికారులకు పంపించారు. అయితే ప్రస్తుత ఆలయం 143.24 గజాలు ఉంది. నూతనంగా విస్తరణ జరిగితే మొత్తం 396.25 చదరపు గజాలు పెరుగుతుంది. ఆలయ గర్భాలయంలో ఎటువంటి మార్పులు, చేర్పులు చేయకుండా కేవలం అంతరాలయం, మండపం విస్తీర్ణం పెంచి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. అంతరాలయం పాతది 3.6 అడుగుల పొడవు నుంచి సుమారు తొమ్మిది అడుగుల మేరకు పెరగనుంది. మొత్తంగా 253 గజాల విస్తీర్ణంతో ఆలయం విశాలంగా అభివృద్ధి కానున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.
దాతల సహకారం అవసరమే..
అమ్మవారి ఆలయం సంపూర్ణంగా చేయాలంటే దాతల సహకారం ఎంతైనా అవసరమే. వాటితోనే ఆలయ నిర్మాణ పనులు జరగాల్సి ఉంది. ప్రస్తుతానికి కోటీ రూ.80లక్షలతో చేపట్టిన పనులు కేవలం ఆలయ విస్తరణకు మాత్రమే సరిపోతుంది. భవిష్యత్తులో క్యూ కాంప్లెక్స్‌లు, అన్నదాన సత్రాలు, కార్యాలయం, కల్యాణ మండపం, కేశ ఖండన శాల తదితర వాటిని నిర్మాణానికి సంబంధించి దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
పైడితల్లి దర్శనం ఇక సులభం
ఆలయం ఇరువైపులా అభివృద్ధి చెందితే అమ్మ దర్శనం ఇక భక్తులకు సులభంగా లభిస్తుంది. కేవలం రెండు క్యూల ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం ఉంది. సాధారణ మంగళవారాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతారు. వచ్చే ఏడాది జాతర నాటికి 396 గజాలలో ఆలయం విస్తీర్ణం జరిగితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు.
ఆలయం పక్కనే బాలాలయ నిర్మాణ పనుల ప్రారంభం
కోటీ రూ.80 లక్షలతో ఆలయ
ప్రాంగణం విస్తరణ
అమ్మ దర్శనం ఇక సులభం
వచ్చే ఏడాది జాతర నాటికి ఆలయం సిద్ధం చేస్తాం..
ఆలయ ఈవో శిరీష
నిర్మాణ పనులు ప్రారంభించాం
ఆలయ విస్తరణ నిర్మాణ పనులు బాలాలయంతో ప్రారంభించాం. బాలాలయం నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చారు. మరికొద్ది రోజుల్లో ఆ పనులు పూర్తవుతాయి. నవంబరు రెండో వారంలో విస్తరణ పనులను సంప్రదాయబద్దంగా చేపడతాం. బాలాలయంలో అమ్మవారి దర్శనాన్ని భక్తులకు కల్పిస్తూ ప్రస్తుతం ఉన్న విగ్రహానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా శాస్త్రోక్తంగా పనులు జరిపించే విధంగా కృషి చేస్తున్నాం. వచ్చే ఏడాది జాతర నాటికి సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టాం. అమ్మ ఆలయం అభివృద్ధికి దాతలందరూ సహకరించాలి.
–కె.శిరీష, పైడితల్లి దేవస్ధానం ఆలయ ఇన్‌చార్జ్ ఈవో, విజయనగరం
శరవేగంగా పైడితల్లి అభివృద్ధి పనులు
శరవేగంగా పైడితల్లి అభివృద్ధి పనులు


