
అన్నదాత గోడు పట్టదా..!
● సంగాంలో అన్నదాతకు తీవ్రనష్టం
● పూడుకుపోయిన తంపర బట్టి
● పంట పొలాల్లోకి వరద నీరు
● నీట మునిగిన పంట పొలాలు
● ఏటా ఇదే దుస్థితి
● పట్టించుకోని ప్రభుత్వం, అధికారులు
● 300 ఎకరాల్లో వరద నీరు పోటు
వంగర: మండల పరిధి సంగాంలో అన్నదాతకు తీరని నష్టం జరుగుతుంది. వర్షం నీరు.. వరద నీరు మళ్లించేందుకు ఏర్పాటు చేసిన తంపర బట్టి పూర్తిగా పూడుకుపోవడంతో ఆ నీరు పంట పొలాల్లోకి వెళ్లిపోతుంది. దీంతో పంట పొలాల్లో నీరు నిలువ ఉండడంతో 300 ఎకరాలు మేర పంటకు ఏటా నష్టం జరుగుతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. తంపర భూములు చుట్టూ ఇక్కడ ఉన్న చేపల చెరువు యజమాని గట్టు కట్టేయడంతో ఈ సమస్య మరింత జఠిలమైంది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ సంగాం, మగ్గూరు గ్రామాలకు చెందిన రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.
ఇదీ సమస్య..
సంగాం, మగ్గూరు గ్రామాలకు చెందిన కడుమల పొలం, షావుకారి పొలం, బోరుమడులు, బదంతాలు పొలంతో పాటు మరిన్ని పంట పొలాలు ఏటా నీట మునుగుతున్నాయి. సంగాంకు చెందిన 250 ఎకరాలు, మగ్గూరుకు చెందిన 50 ఎకరాలు తంపర బట్టి సమీపంలో పంట పొలాలున్నాయి. ఈ తంపర బట్టి ఎగువ భాగంలో 16 ఎకరాల తంపర పొలాలున్నాయి. ఈ పొలాల్లో చేరిన వరద నీరు తంపర పొలాల నుంచి తంపర బట్టిలోకి వెళ్లి నేరుగా సంగాం గ్రామ సమీపంలో ఉన్న నాగావళి నదిలోకి ప్రవేశిస్తుంది. అయితే తంపర బట్టి పూర్తిగా పూడుకుపోవడంతో చేపలు చెరువుల్లోని నీరు, తంపర పొలాల్లోని నీరు పంట పొలాల్లోకి చొరబడుతుంది. దీంతో ఈ సమస్య నెలకొంది.
ప్రభుత్వం.. అధికారుల నిర్లక్ష్యం
గడిచిన కొన్నేళ్లుగా తంపర బట్టి పొలాలపై ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. తంపర బట్టిలో పూడిక తీత పనులు చేపడితే కొంత నష్ట నివారణ జరుగుతుందని, అదే విధంగా ఇరిగేషన్ అధికారులు కూడా ఇక్కడ పనులు చేపట్టడకపోవడం ఈ పరిస్థితి నెలకొంది. అలాగే 14 మీటర్లు వెడల్పు ఉన్న తంపర బట్టి కేవలం నాలుగు మీటర్లకు కుదించిపోవడంతో వృథా నీరు, వరద నీరు వెలుపలికి తరలించే పరిస్థితి లేదు. చేపలు చెరువు యజమాని ఏటా రెండుసార్లు తంపరబట్టిలో పూడిక తీస్తామని హామీ ఇచ్చినా ఎన్నడూ పట్టించుకోలేదని ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. తంపరబట్టికి ఇరువైపుల ఉన్న సంగాం, మగ్గూరుకు చెందిన 300 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లుతుంది. ప్రస్తుతం రైతులు ఉబాలు వేసిన నాట్లు నీటిలోనే ఉన్నాయి.

అన్నదాత గోడు పట్టదా..!

అన్నదాత గోడు పట్టదా..!