
సాలూరులో అగ్నిప్రమాదం
సాలూరు: పట్టణంలోని పెదహరిజనపేటలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. దీనిపై ఫైర్ అధికారి రాజారావు తెలిపిన వివరాల ప్రకారం, పెదహరిజనపేటలో నివాసముంటున్న బి.సురేష్ ఇంట్లోని మూడవ అంతస్తులో గురువారం సాయంత్రం గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడ ఉన్న సామగ్రి, విలువైన సర్టిఫికెట్లు తదితర వస్తువులు దగ్ధమయ్యాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపుచేశారు. సుమారు రూ.2లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా.
యువకుడి దుర్మరణం●
● గిరిప్రదక్షిణ నుంచి వస్తుండగా ప్రమాదం
భోగాపురం: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరగ్గా ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. సింహాచలంలో గిరిప్రదక్షిణకు హాజరూ ద్విచక్రవాహనంపై మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన యువకుడు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న విద్యుత్ పోల్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని మారికవలస గ్రామానికి చెందిన రావాడ ఉదయ్(28) అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌పై వెనుక కూర్చున్న స్నేహితుడు చిన్నారావు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం తగరపువలస ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సుందరపేట సీహెచ్‌సీకి తరలించారు.
వసతిగృహం ఆకస్మిక తనిఖీ
గంట్యాడ: మండల కేంద్రంలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతి గృహాన్ని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ అన్నపూర్ణ గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మమేకమై పలువిషయాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని మంచి భవిష్యత్తు సాధించాలని సూచించారు. అ తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో వసతిగృహ సంక్షేమ అధికారి గొర్లె గోవింద సన్యాసిరావు పాల్గొన్నారు.

సాలూరులో అగ్నిప్రమాదం

సాలూరులో అగ్నిప్రమాదం