
కదంతొక్కిన పంచాయతీ కార్యదర్శులు
కలెక్టరేట్ వద్ద పంచాయతీ కార్యదర్శుల నిరసన
● ఉద్యోగోన్నతులు కల్పించాలి..
పని భారం తగ్గించాలని డిమాండ్
● కలెక్టరేట్ ఎదుట నిరసన
ప్రదర్శన, మానవహారం
● అవసరమైతే నిరవధిక సమ్మెకు సిద్ధమని
ప్రకటన
విజయనగరం:
గ్రామీణప్రాంత ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు ఆయా ప్రాంతాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే పంచాయతీ కార్యదర్శులు పోరుబాట పట్టారు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డెక్కారు. పనిభారం తగ్గించాలని, ఉద్యోగోన్నతులు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. జిల్లా పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నాచేశారు. ప్లకార్డులు ప్రదర్శించి తమ నిరసన గళం వినిపించారు. కలెక్టరేట్ కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ కార్యదర్శులు సమాఖ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.సంగమేశ్వరరావు, బి.శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్యదర్శులకు లేనిపోని పనులన్నీ అప్పగిస్తోందన్నారు. ఉదయం 6 గంటలకే ఇంటింటికీ చెత్త సేకరణ, క్లోరినేషన్ ఫొటోలను తీయమనడం దారుణమన్నారు. మహిళా కార్యదర్శులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రభుత్వ నిర్ణయంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంచాయతీరాజ్ కమిషనర్ కారదర్శుల పనితీరులో నిజాయితీ లేదంటూ అవహేళన చేస్తూ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడటం సమంజసం కాదన్నారు. ఆ వాఖ్యలు ముమ్మాటికీ మానవ హక్కులను మంటగలిపేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పంచాయతీరాజ్ కమిషనర్ చేసిన వాఖ్యలను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు గ్రామ సభలు నిర్వహించడం, యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పంచాయతీ కార్యదర్శులు రాత్రీ, పగలు శ్రమించి పనిచేసిన విషయాన్ని మర్చిపోకూడదన్నారు.
సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు సిద్ధం
పంచాయతీ కార్యదర్శులు సమస్యలు పరిష్కరించుకుంటే నిరవధిక సమ్మెకు వెనుకాడేది లేదని జిల్లా పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో గ్రామ పంచాయతీల్లో 36 రకాల సర్వేలను చేపట్టడంతో పాటు అభివృద్ధి పనులు, గ్రామ సభల నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు, ఎన్నికల విధులు, ప్రోటోకాల్ విధులతో పంచాయతీ కార్యదర్శులకు పనిభారం పెరిగి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. కొత్త నియామకాలు చేపట్టి పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. పనివేళలను ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటలకు పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. వేతనం, బేసిక్‌లను మార్పులు చేయాలని, పంచాయతీ కార్యదర్శుల గ్రేడ్‌లను 6 నుంచి 3కు కుదించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు. అనంతరం డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్‌తో పాటు జిల్లా పంచాయతీ కార్యదర్శులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య ఉపాధ్యక్షుడు అచ్యుత్, ఎం.శ్రీనివాస్, జిల్లా పంచాయతీ కార్యదర్శుల యూనిట్ ప్రతినిధులు ఎ.మురళి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

కదంతొక్కిన పంచాయతీ కార్యదర్శులు