సంగమేశ్వరస్వామి దర్శనం.. సర్వపాప హరణం

బలరాముడు ప్రతిిష్ఠించిన శివలింగం - Sakshi

● సంగాంలో బలరాముడు ప్రతిష్ఠించిన శివలింగం ● అలహాబాద్‌ తరహాలో త్రివేణి సంగమం ప్రత్యేకత ● నేడే తొలి కార్తీక సోమవారం

వంగర: అక్కడ శివలింగ దర్శనం సర్వపాప హరణం. కార్తీక మాసంలో సంగమేశ్వరుడిని దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వంగర మండలం సంగాంలో వెలసిన పవిత్ర సంగమేశ్వరస్వామి దేవాలయానికి కార్తీకమాస వేళల్లో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ద్వాపర యుగంలో బలరాముడు ఏకకాలంలో ప్రతిష్ఠించిన ఐదు శివలింగాల్లో ఇక్కడిదొకటి. అందువలన ప్రత్యేకత సంతరించుకుంది.

త్రివేణి సంగమం స్నానం పావనం

ఈ ఆలయ ప్రాంగణంలో నాగావళి, సువర్ణముఖి, వేగావతి మూడు నదులు కలిసే కూడలి ఉంది. ఈ ప్రాంతం త్రివేణి సంగమంగా గుర్తింపు పొందింది. ఇక్కడ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి సంగమేశ్వరుడిని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అలహాబాద్‌ తరహాలో ఈ ప్రదేశంలో మూడు నదులు కలిసే కూడలి ఉంది. సంగమేశ్వస్వామి దర్శనార్థం వచ్చే భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి సంగమేశ్వరుడిని దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని భక్తులు ప్రగాఢ విశ్వాసం. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్తీక మాసంలోని అన్ని రోజుల్లో భక్తులు ఇక్కడకు వచ్చి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి సంగమేశ్వరస్వామిని దర్శనం చేసుకుంటారు.

పితృదేవతలను స్మరించే స్థలం

మూడు నదులు కలిసే త్రివేణి సంగమం ఒడ్డున పితృదేవతలకు కూడా ప్రత్యేక పూజలు అర్పిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న 400 సంవత్సరాల నాటి భారీ మర్రి వృక్షం ఉంది. ఈ చెట్టు నీడన వంటా వార్పు చేసి త్రివేణి సంగమంలో పితృదేవతలకు పిండ ప్రధానాలు చేస్తారు. అలా చేస్తే మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని భక్తులు నమ్ముతారు.

ఇలా చేరుకోవాలి..

రాజాం పట్టణానికి 23 కిలోమీటర్ల దూరంలో సంగాం ఉంది. వంగర, రుషింగి, కొప్పర గ్రామాలకు వెళ్లే బస్సులు ఎక్కితే మెట్ట మగ్గూరు వద్ద దిగి అక్కడ నుంచి ఆటోలో సంగాం చేరుకోవచ్చు. ఉదయం 7.15, 8.00, 9.00, 11.00 గంటలకు, మధ్యాహ్నం 3, 4.30, 6గంటలకు రాజాం కాంప్లెక్స్‌ నుంచి బస్సులు ఉన్నాయి. అదే విధంగా రాజాం నుంచి సంగాం వరకు ఆటోలు కూడా విరివిగా ఉంటాయి. 50 నిమిషాల ప్రయాణం ఉంటుంది.

ఎం.సీతారాంపురంలో

108 స్తంభాల ఆలయం

ఇక్కడ 108 స్తంభాల శివాలయం ప్రసిద్ధి. 450 ఏళ్ల క్రితం దీనిని బొమ్మిరెడ్డిపల్లికి చెందిన వారు నిర్మించారని పూర్వీకులు చెబుతారు. ఆలయం లోపల ఉన్న 108 స్తంభాలతో గుడి గోపురం ఇమిడి ఉంది. ఆలయ కుడ్యాలపై వెలసిన దేవతామూర్తులు విగ్రహాలు అందరినీ ఆకట్టుకుంటాయి. దీంతో కార్తీక మాసంలో పూజల కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.

Read latest Vizianagaram News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top