నిలిచిపోయిన హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ | Sakshi
Sakshi News home page

నిలిచిపోయిన హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌

Published Fri, Nov 17 2023 12:54 AM

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ 
నాగలక్ష్మి, జేసీ మయూర్‌ అశోక్‌  - Sakshi

జామి: భీమసింగి గోస్తనీ నదిపై ఉన్న వంతెనపై హౌరా సూపర్‌పాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ గురువారం 15 నిమిషాలపాటు నిలిచిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి హౌరా వెళ్తున్న సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో భీమసింగి వంతెన వద్ద పొగలు రావడాన్ని సమీపంలో వనం పద్మనాభం అనే పశువుల కాపరి గమనించి పెద్దగా కేకలు వేశాడు. దీంతో రైలులో ప్రయాణిస్తున్న వారు చైన్‌ లాగడంతో రైలు నిలిచిపోయింది. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది పరిశీలించి... బ్రేక్‌ బైండింగ్‌ వల్ల అప్పుడప్పుడు పొగలు వస్తాయని, ప్రమాదం ఏమీ ఉండదని తెలిపారు.

అభ్యంతరాలు శతశాతం పరిష్కారం

కలెక్టర్‌ నాగలక్ష్మి

విజయనగరం అర్బన్‌: స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌లో భాగంగా ఓటర్ల జాబితాకు సంబంధించిన అభ్యంతరాలను శతశాతం పరిష్కరించామని కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. ఫారం–9, 10, 11, 11ఏ, 11బీ కింద వచ్చిన మొత్తం దరఖాస్తులను 7 నియోజకవర్గాల్లో పూర్తిగా పరిష్కరించి అప్‌లోడ్‌ చేసినట్టు వివరించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా డ్రాప్ట్‌ పబ్లికేషన్‌ రోజున పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితి, లింగనిష్పత్తి, ఓటర్ల నమోదు, ఓట్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, రాజకీయ పార్టీల ఫిర్యాదులు, ఇ–రోల్‌పై రిపోర్ట్‌లు, ఎపిక్‌ కార్డుల జనరేషన్‌, పంపిణీ, పీఎస్‌ఈలు, డీఎస్‌ఈలు, తదితర అంశాలపై కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న నాగలక్ష్మి జిల్లా వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సీఈఓకు వివరించారు. ప్రతి నియోజకవర్గంలో 12 చొప్పున పొలిటికల్‌ పార్టీల సమావేశాలు నిర్వహించామన్నారు. సమావేశపు మినట్స్‌ను కూడా ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశామని చెప్పారు. కార్యక్రమంలో జేసీ మయూర్‌ అశోక్‌, డీఆర్‌ఓ అనిత, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

దివ్యాంగ పిల్లలకు ట్యాబ్‌ల పంపిణీ

గజపతినగరం: జిల్లాలోని సర్కారు పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాల పిల్లలు 169 మంది, వారికి బోధించే ఉపాధ్యాయులు 41 మందికి ప్రభుత్వం ట్యాబ్‌లు పంపిణీ చేసినట్టు స్టేట్‌ అసిస్టెంట్‌ ఐ.ఇ (ఇన్‌క్లూజివ్‌ ఎడ్యుకేషన్‌) కో ఆర్డినేటర్‌ ఎన్‌.అమ్మినాయుడు తెలిపారు. పురిటిపెంట న్యూకాలనీ ప్రాథమిక పాఠశాలను ఆయన గురువారం పరిశీలించారు. జిల్లాలో చదువుతున్న దివ్యాంగుల పిల్లలు ఎంతమంది ఉన్నారు, వారికి జగనన్న విద్యాకానుక కిట్లు, ట్రైసైకిల్స్‌, వీల్‌ చైర్స్‌, ప్రత్యేక విద్యాబోధనకు ట్యాబ్‌లు అందుతున్నదీ లేనిదీ తెలుసుకుంటున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్‌ ఐ.ఇ.కోఆర్డినేటర్‌ ఎమ్‌.భారతి, ఎంఈఓ విమలమ్మ, హెచ్‌ఎం ఎస్‌.సుజాత, ఐఈఆర్‌టీ టీచర్‌ ఎర్రా శ్రీనివాసరావు, జి.సత్యనారాయణ పాల్గొన్నారు.

కులగణన సర్వేపై అభిప్రాయ సేకరణ

జిల్లా బీసీ, సంక్షేమ సాధికారత అధికారి సందీప్‌కుమార్‌

విజయనగరం అర్బన్‌: జిల్లాలో చేపడుతున్న కులగణన సర్వే ప్రక్రియపై అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఈ నెల 18న కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహిస్తామని జిల్లా బీసీ, సంక్షేమ సాధికారత అధికారి కె.సందీప్‌కుమార్‌ తెలిపారు. నిజమైన అర్హత కలిగి ఉండి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందని వారిని గుర్తించి వారికి లబ్ధి చేకూర్చేందుకు సర్వే దోహదపడుతుందని పేర్కొన్నారు. కలెక్టర్‌ నాగలక్ష్మి నేతృత్వంలో జరగనున్న కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ నాయకులు, మేధావులు పాల్గొని తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలను తెలియజేయాలన్నారు.

పురిటి పెంట న్యూకాలనీ పాఠశాలలో మాట్లాడుతున్న అమ్మినాయుడు
1/1

పురిటి పెంట న్యూకాలనీ పాఠశాలలో మాట్లాడుతున్న అమ్మినాయుడు

Advertisement
 
Advertisement