రాజన్న ఆటోనగర్‌ ఎక్కడ బాబు? | - | Sakshi
Sakshi News home page

రాజన్న ఆటోనగర్‌ ఎక్కడ బాబు?

May 23 2026 1:52 AM | Updated on May 23 2026 1:52 AM

● తమకు కేటాయించిన భూమిలో 27 ఎకరాలు బడా కంపెనీకి ఎలా ఇస్తారు? ● పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం: ఆటోనగర్‌ యూనియన్‌ హెచ్చరిక

డాబాగార్డెన్స్‌ : నగర సుందరీకరణ పేరిట వేలాది మంది నోళ్లు కొట్టి, రెక్కల కష్టాన్ని నమ్ముకున్న స్క్రాప్‌ కార్మికులను రోడ్డున పడేస్తారా? గతంలో మీరే ఇచ్చిన జీవోను తుంగలో తొక్కి, బడా బాబుల కోసం కొత్త నాటకాలకు తెరతీస్తారా? అంటూ చంద్రబాబు సర్కారుపై ఆటోనగర్‌ యూనియన్‌ నేతలు, సిటూ నాయకులు నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, కార్మికుల కోసం కేటాయించిన భూములను కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయడమేంటని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు తెచ్చిన జీవో.. జగన్‌ సర్కార్‌ వేగవంతం

2019లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం విశాఖ నగర సుందరీకరణ పేరిట స్క్రాప్‌ వర్కర్లను నగరం నుంచి బయటకు పంపించింది. ఆ సమయంలో ఆనందపురం మండలం కణమాం వద్ద ఆటోనగర్‌ నిర్మిస్తామని వాగ్ధానం చేస్తూ.. 157.77 ఎకరాల భూమిని కేటాయించి జీవో కూడా విడుదల చేసింది. అయితే ఆ వెంటనే ప్రభుత్వం మారడం, వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రావడం జరిగాయి. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదికే 2022లో విశాఖను ‘స్క్రాప్‌ ఫ్రీ సిటీ’గా మార్చేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ‘రాజన్న ఆటోనగర్‌’ పేరిట ప్రాజెక్టును వేగవంతం చేస్తూ.. ప్రతిపాదిత భూమిలోని సాగుదారులకు పరిహారం ఇచ్చేందుకు ఏకంగా రూ. 20 కోట్లను బ్యాంకులో జమ చేసింది. మరో రూ. 12 కోట్లు కూడా విడుదల కావాల్సి ఉందని అప్పట్లోనే ఏపీఐఐసీ అధికారులు ప్రకటించారు. కోవిడ్‌ వల్ల పనులు కాస్త ఆలస్యమైనా, శంకుస్థాపనకు సర్వం సిద్ధమైంది. కానీ, మళ్లీ ప్రభుత్వం మారడంతో కథ మొదటికొచ్చింది.

ఆదానీ గ్రూప్‌నకా కార్మికుల భూములు?

చంద్రబాబు సర్కార్‌ పగ్గాలు పట్టి రెండేళ్లు అవుతున్నా ఆటోనగర్‌ పనులు అతీగతీ లేవు. పైగా, ఇప్పుడు ఆ స్థలంపై కార్పొరేట్‌ దిగ్గజం ‘ఆదానీ గ్రూప్‌’ కన్ను పడిందని, అందుకే చంద్రబాబు కొత్త నాటకాలకు తెరలేపారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎలాంటి జీవోలు లేకుండా, కార్మికుల కోసం కేటాయించిన భూమిలో 27 ఎకరాలను ఒక బడా కంపెనీకి కట్టబెట్టేందుకు ప్రభుత్వం తహతహలాడుతోందని మండిపడుతున్నారు.

2500 కుటుంబాల పొట్టకొడతారా?

తగరపువలస నుంచి గాజువాక వరకు.. పెందుర్తి, ఎండాడ, ఇసుకతోట, జ్ఞానాపురం తదితర ప్రాంతాల్లో ఉన్న 1300కు పైగా స్క్రాప్‌ దుకాణాలు, వాటిని నమ్ముకున్న 2,500 కార్మిక కుటుంబాల ప్రయోజనం కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు ఇది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు అనువుగా ఉండే ఈ కణమాం రాజన్న ఆటోనగర్‌ను నిర్మించకుండా కాలయాపన చేయడం దారుణం.

కణమాంలో సిటూ భారీ ధర్నా

ప్రభుత్వ తీరుకు నిరసనగా గురువారం కణమాం గ్రామంలో సిటూ ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. 2019లో తానే ఇచ్చిన ఆటోనగర్‌ వాగ్ధానాన్ని చంద్రబాబు నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సిటూ నాయకులు వై.రాజు, కె.చంద్రశేఖర్‌, గణేష్‌, సమీర్‌, సత్యనారాయణ, రియాజ్‌, ఖయ్యూం ఖాన్‌, రమేష్‌, రాజు మాట్లాడుతూ.. కార్మికులను అభద్రతా భావానికి గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్పొరేట్‌ శక్తులకు భూములు కట్టబెట్టే ప్రయత్నాలను అడ్డుకుంటామని, కణమాంలో ’రాజన్న ఆటోనగర్‌’ నిర్మించే వరకు విశాఖ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.

సొంత జీవోనే బుట్టదాఖలు చేస్తారా?

చంద్రబాబు స్వయంగా ఇచ్చిన జీవోను ఆయనే బుట్టదాఖలు చేస్తారా? మాకు కేటాయించిన స్థలాన్ని వేరే వారికి ఇవ్వడంలో ఆంతర్యమేంటి? గత 15 ఏళ్లుగా దీనికోసం తిరుగుతున్నాం. ఓ వైపు నగరం నుంచి మమ్మల్ని వెళ్ళిపోమంటారు, మరోవైపు మాకు కేటాయించిన స్థలాన్ని మాకు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఇప్పటికై నా చంద్రబాబు సర్కార్‌ మమ్మల్ని గుర్తించి న్యాయం చేయాలి.

–విజయ్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, స్మార్ట్‌ విశాఖ ఆటో పార్ట్స్‌

అండ్‌ స్క్రాప్‌ డీలర్స్‌ అసోసియేషన్‌

ఇతరుల పనులు జరుగుతున్నాయి!

2019 జనవరి 24న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆ తర్వాత వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ. 32.64 కోట్లు మంజూరు చేసి, అందులో దాదాపు రూ. 22 కోట్లను బ్యాంకులో డిపాజిట్‌ చేసింది. ఇప్పుడు అక్కడ పనులు జరుగుతున్నట్టు తెలిసి ఏపీఐఐసీ ప్రతినిధిని అడిగితే.. అందులో 27 ఎకరాలు ఆదానీ గ్రూప్‌నకు ఇచ్చినట్లు చెప్పారు. దానికి సంబంధించిన జీవో చూపించమంటే లేదంటున్నారు. 2015 నుంచి ఆటోనగర్‌ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. గతంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మా అభ్యర్థనను మన్నించి క్లియరెన్స్‌ ఇచ్చారు. ఇప్పుడు మా స్థలాన్ని వేరే వారికి ఎలా ఇస్తారు?

– పటాన్‌ ఖాజావల్లీ, అధ్యక్షుడు, ఆటోనగర్‌ యూనియన్‌

Advertisement
 
Advertisement
Advertisement