సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన బాట | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన బాట

May 8 2026 9:38 AM | Updated on May 8 2026 9:38 AM

● రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఎన్జీజీవో హెచ్చరిక ● పీఆర్సీ చైర్మన్‌ను వెంటనే నియమించాలి

మహారాణిపేట: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల పెండింగ్‌ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగితే, భవిష్యత్తు కార్యచరణను ప్రకటించడానికి త్వరలో నే సమావేశం అవుతామని హెచ్చరించారు. గురువారం నగరంలోని ఎన్జీవో హోమ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సంఘ నేతలతో కలిసి మాట్లాడారు. కొత్త పీఆర్సీ కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం వెంటనే పీఆర్సీ చైర్మన్‌ను నియమించి, ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పెరిగిన ధరలు, జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగులకు తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు, సరెండర్‌ లీవ్‌ బకాయిలను ఒక క్రమపద్ధతిలో వెంటనే విడుదల చేయాలని, యాక్ట్‌ 30 ప్రకారం అర్హులైన కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేయాలని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు.

సెలవు రోజుల్లో ఒత్తిడి చేయడం తగదు

ప్రభుత్వ లక్ష్యాల సాధన కోసం ఉద్యోగులు అహర్నిశలు శ్రమిస్తున్నారని, అయితే సెలవు రోజుల్లో కూడా వారిని పని చేయమని ఒత్తిడి తీసుకురావడం సరికాదని విద్యాసాగర్‌ పేర్కొన్నారు. విశ్రాంతి ఉంటేనే ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయగలరని వివరించారు. అలాగే, ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం సమంజసం కాదని, దానిని కేవలం ఒక మోడల్‌గా మాత్రమే తీసుకోవాలని సూచించారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డుల ద్వారా పూర్తిస్థాయి ప్రయోజనం అందడం లేదని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు రావాల్సిన అడిషనల్‌ క్వాంటం ఆఫ్‌ పెన్షన్‌ను మంజూరు చేయాలన్నారు. ఏపీ ఎన్జీజీవో ప్రధాన కార్యదర్శి డీవీ రమణ మాట్లాడుతూ.. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, అదే స్ఫూర్తితో రెగ్యులర్‌ ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏపీ ఎన్జీజీవో విశాఖ అధ్యక్షుడు కె.ఈశ్వరరావు, కార్యదర్శి ఎం. రవికుమార్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం, పి.అప్పలరాజు, వై.నారాయణరావు, జి. చంద్రరావు, అనిత, రత్నకుమారి, పి. కృష్ణమూర్తి, టి.గోపాలకృష్ణ, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement