అల్లిపురం: భీమునిపట్నం న్యాయస్థాన పరిధిలోకి చేర్చిన పెందుర్తి, చినగదిలి మండల ప్రాంతాలను విశాఖ న్యాయస్థానాల పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్‌కు విశాఖ న్యాయవాదులు విన్నవించారు. ఈ మేరకు అమరావతిలో గురువారం కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు నమ్మి సన్యాసిరావు మాట్లాడుతూ మధురవాడ, రుషికొండ, విశాలాక్షినగర్, పెందుర్తి, వేపగుంట, సుజాతానగర్, నరవ, ఆరిలోవ ప్రాంతాలలో కొంతభాగం భీమునిపట్నం న్యాయస్థాన పరిధిలోకి వెళ్లాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈప్రాంతాల్లో నివసించే కక్షిదారులు, న్యాయవాదులు వ్యయప్రయాసలకు లోనవుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాంతాలన్నీ విశాఖ న్యాయస్థానాల పరిధిలోనే ఉండేవన్నారు. న్యాయవాదులు చెప్పిన వివరాలను పరిశీలించిన చీఫ్ జస్టిస్ లిసా గిల్ తప్పకుండా పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. చీఫ్ జస్టిస్‌ను కలిసిన వారిలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎస్.కృష్ణమోహన్, కె.రామజోగేశ్వరరావు, బి.వి.ఆర్.మూర్తి, కె.ఎల్.డి.నాగశ్రీ, సంఘం నాయకులు గాలి రామిరెడ్డి ఉన్నారు.


