వైశాఖ జనజాతర | - | Sakshi
Sakshi News home page

వైశాఖ జనజాతర

May 2 2026 11:55 AM | Updated on May 2 2026 11:55 AM

● సింహగిరికి వైశాఖ పౌర్ణమి శోభ ● పుష్కరిణి వద్ద పోటెత్తిన భక్తజనం ● గరిడీ నృత్యాలు.. కోలలకు పూజలు

సింహాచలం: వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సింహగిరి భక్తజన సంద్రమైంది. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందు కు భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, మత్స్యకారులు తమ ఆచార వ్యవహారాలతో అప్పన్న క్షేత్రాన్ని భక్తిపారవశ్యంలో ముంచెత్తారు. తొలుత కొండ దిగువన ఉన్న వరాహ పుష్కరిణి వద్ద భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, పుష్కరిణి ప్రాంగణంలోనే కుటుంబ సమేతంగా వంటలు వండుకుని సహపంక్తి భోజనాలు చేశారు. తమ సంప్రదాయాన్ని చాటు తూ భక్తులు చేసిన గరిడీ నృత్యాలు, కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామివారి ప్రతిరూపాలుగా భావించే కోలలకు భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పుష్కరిణి నుంచి అడవివరం మార్కెట్‌ కూడలి వరకు ఉన్న మార్గమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా గోపాలపట్నం పోలీసులు, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. భక్తులు మొక్కులు తీర్చుకుంటూ మెట్లమార్గం ద్వారా సింహగిరికి చేరుకున్నారు. కొండపై ఉన్న క్యూలు, కేశఖండన శాల, ప్రసాద విక్రయశాలలు భక్తులతో నిండిపోయాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో నీలాద్రి గుమ్మం వద్ద నుంచే లఘు దర్శనాన్ని కల్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement