విశాఖ నుంచి హైదరాబాద్‌కు ప్రతి రోజూ 100 శాతం ఆక్యుపెన్స
వైజాగ్ నుంచి అగమ్యగోచరంగా మారిన విమానయానం
నాలుగు రోజులుగా ఇండిగో విమానాల రద్దుతో ఇక్కట్లు
ఒక్కసారిగా 6 రెట్లు టికెట్ ధర పెంచేసిన విమానయాన సంస్థలు
వైజాగ్ నుంచి ముంబైకి రూ.56,798, అహ్మదాబాద్ రూ.50వేలు
హైదరాబాద్‌కు
విమానాల్లేవు
సాక్షి, విశాఖపట్నం : అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. సర్వీసులు ఈరోజే ప్రారంభమవుతాయని సర్ది చెబుతున్న ఇండిగో.. చివరి నిమిషంలో సర్వీసులు రద్దు చేసేస్తున్నామంటూ ప్రకటిస్తోంది. దీంతో అత్యవసర ప్రయాణాల కోసం విమానాలపై ఆధారపడిన వారి అవసరాన్ని ఆసరాగా తీసుకుంటూ.. ఇతర సంస్థలు భారీగా టికెట్ ధరల్ని పెంచేస్తూ దోచుకుంటున్నాయి. తప్పనిసరిగా వెళ్లాల్సిన ప్రయాణికులు ఊసురోమంటూ జేబులు ఖాళీ చేసుకుంటు మరీ వెళ్లాల్సి వస్తోంది. గత నాలుగు రోజులుగా ఇండిగో విమాన సర్వీసులు విశాఖ నుంచి రద్దవుతున్నాయి. తొలి రెండు రోజుల్లో 5 నుంచి 8 సర్వీసులు, శుక్రవారం 15, శనివారం 9 సర్వీసులు రద్దు చేసినట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. ఇక్కడి నుంచి రోజూ దాదాపు 5 వేల మంది ప్రయాణికులు ఇండిగో విమానాల్లో ప్రయాణిస్తుంటారు. ఇండిగోలో నెలకొన్న అంతర్గత సమస్యల వల్ల రెండు మూడు రోజులుగా భారీ సంఖ్యలో విమానాలు క్యాన్సిల్ చేస్తున్నారు.
భారీగా పెరిగిన టికెట్ ధరలు
వైజాగ్ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చైన్నె, ఢిల్లీ, తిరుపతి దేశీయ సర్వీసులతో పాటు అబుదాబీ అంతర్జాతీయ సర్వీసులున్నాయి. ఆయా నగరాలకు వెళ్లే 15 సర్వీసులను ఇండిగో శుక్రవారం రద్దు చేసింది. అంతేకాకుండా మిగిలిన సర్వీసుల రాకపోకల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఈ ప్రభావం టికెట్ ధరలపై పడింది. ప్రయాణికుల అవసరాన్ని క్యాష్ చేసుకునేలా మిగిలిన విమానయాన సంస్థలు టికెట్ రేట్లను గణనీయంగా పెంచేశాయి. ఉదాహరణకు విశాఖ నుంచి ముంబైకి సాధారణ రోజుల్లో 6,612 నుంచి రూ. 7,132 వరకూ ఉంటుంది. ఆదివారం (7వ తేదీన) విశాఖ నుంచి ముంబైకి వెళ్లే బదులు విశాఖ నుంచి సింగపూర్ రెండు సార్లు వెళ్లి రావొచ్చు అనేంతలా టికెట్ ధరలు పెంచేశారు. 7వ తేదీన సింగపూర్‌కు టికెట్ ధర రూ.17,309 ఉంటే.. ముంబైకి ఏకంగా రూ.56,798కి పెంచేశారు. విశాఖ నుంచి అహ్మదాబాద్‌కు రూ.7,500 నుంచి రూ.8,500 వరకూ టికెట్ ధర ఉంది. ఇప్పుడు ఏకంగా రూ.50,000 దాటింది. వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు రూ.3,500 నుంచి రూ.4,500 వరకూ టికెట్ ధర ఉంటుంది. ఇప్పుడు ఏకంగా రూ.25,000గా మారిపోయింది.
రూల్స్ పట్టించుకోని ఎయిర్‌లైన్స్ సంస్థలు: టికెట్ ధరలు మోతమోగిపోతుండటంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. విమానయాన సంక్షోభం సందర్భంగా ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలు ఇష్టం వచ్చినట్లుగా రేట్లు పెంచడంపై విమర్శలు వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దూరం బట్టి నిర్దేశించిన టికెట్ ధరల్నే వసూలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 500 కి.మీ వరకు అన్ని పన్నులతో కలిపి రూ.7,500 గరిష్ట చార్జీ వసూలు చేయాలని, 500–1000 కి.మీ వరకూ రూ.12 వేలు, 1000–1500 కి.మీ వరకూ రూ.15 వేలు, 1500 కి.మీ పైన అయితే రూ.18,000 టికెట్ ధరలుగా నిర్ణయించింది. అయినా.. విమానయాన సంస్థలు తమకు నచ్చినట్లుగానే టికెట్ ధరలు పెంచేస్తున్నాయి. ఇండిగో సంస్థలో సంక్షోభం సమసిపోయేంత వరకూ విమాన ప్రయాణాలు మానుకోవడమే బెటర్ అన్నట్లుగా ప్రయాణికులు భావిస్తున్నారు.
రద్దయిన విమానాలు
శనివారం 9 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. విశాఖ–చైన్నె (845), విశాఖ–ముంబై(6,585), విశాఖ–హైదరాబాద్(6645), విశాఖ–హైదరాబాద్(783), విశాఖ–బెంగళూరు(2772), విశాఖ–కోల్‌కత్తా (617), విశాఖ–హైదరాబాద్ (883), విశాఖ–హైదరాబాద్(6286), విశాఖ–ఢిల్లీ(6680) విమానాలు రద్దయ్యాయి.
విశాఖ నుంచి హైదరాబాద్‌కు ప్రతి రోజూ 100 శాతం ఆక్యుపెన్స


