బ్రేక్
జీవీఎంసీ స్థాయీ సంఘంలో ‘సాక్షి’ కథనం ప్రకంపనలు
ఒక్కో టాయిలెట్‌కు రూ.16,200 అద్దైపె సభ్యుల నిలదీత
రూ.1.62 కోట్ల చెల్లింపులు వాయిదా
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీలో వాడీవేడి చర్చ
సభ్యుల పట్టుతో పలు అంశాల వాయిదా
మొబైల్ టాయిలెట్ల బిల్లులకు
డాబాగార్డెన్స్: యోగా దినోత్సవం పేరుతో జీవీఎంసీ ప్రజారోగ్య శాఖ అధికారులు ప్రతిపాదించిన అంశాలపై స్థాయీ సంఘం భగ్గుమంది. ఈ ఏడాది జూన్ 21న యోగా డే సందర్భంగా ఏర్పాటు చేసిన మొబైల్ టాయిలెట్లకు సంబంధించిన చెల్లింపుల వ్యవహారంపై ఈ నెల 4న ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘మొబైల్ టాయిలెట్ మస్కా’ కథనం సమావేశంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ కథనం ఆధారంగా సభ్యులు అధికారులను నిలదీయడంతో.. మేయర్ పీలా శ్రీనివాసరావు ఆయా బిల్లుల చెల్లింపులను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన జరిగిన స్థాయీ సంఘ సమావేశంలో పలు అంశాలపై వాడీవేడిగా చర్చ జరిగింది.
రూ.1.62 కోట్ల బిల్లులపై అభ్యంతరం
యోగా డే కోసం ఏర్పాటు చేసిన పోర్టబుల్ వీఐపీ టాయిలెట్లకు సంబంధించి, కార్యక్రమం ముగిసిన ఆరు నెలల తర్వాత ఇప్పుడు రూ. 1.62 కోట్ల చెల్లింపుల కోసం అధికారులు ప్రతిపాదనలు తెచ్చారు. దీనిపై సభ్యులు సాడి పద్మారెడ్డి, రాపర్తి త్రివేణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో నేవీ డే సందర్భంగా ఒక్కో టాయిలెట్(మొత్తం 60)కు కేర్ టేకర్‌తో కలిపి కేవలం రూ. 4 వేలు చెల్లిస్తే, ఇప్పుడు ఏకంగా రూ. 16,200 ఎలా చెల్లిస్తారని వారు ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందని సభ్యులు పట్టుబట్టడంతో, అజెండాలోని 199 నుంచి 225 వరకు ఉన్న అంశాలను విచారణ కోసం మేయర్ వాయిదా వేశారు.
‘రాషా’అంటేనే అవినీతి
రాషా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(హైదరాబాద్) సంస్థ అంటేనే అవినీతికి మారుపేరని సభ్యురాలు సాడి పద్మారెడ్డి ఆరోపించారు. భీమిలిలో ఆపరేషన్ మెయింట్‌నెన్స్ పద్ధతిలో 15వ ఆర్థిక సంఘం నిధులతో 30 ఎంటీడీ సామర్థ్యం గల పోర్టబుల్ మెకనైజ్డ్ గార్బేజ్ ట్రాన్సఫర్ స్టేషన్‌ను ఆ సంస్థ నిర్మించింది. గతేడాది అక్టోబర్ 15 నుంచి 31 అక్టోబర్ వరకు ట్రయల్ పీరియడ్ నిర్వహించింది. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ 31 వరకు మెయింట్‌నెన్స్ కోసం వచ్చిన అంశంపై సభ్యురాలు సాడి పద్మారెడ్డి స్పందించారు. దీనిపై కమిటీ వేసి, క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుందామని ఆమె కోరగా.. వచ్చే బుధవారం అధికారులతో కలిసి ప్లాంట్‌ను సందర్శించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు నిర్ణయించారు.
రాయి తొలగింపునకు రూ.12 లక్షలా?
ఏయూ గ్రౌండ్‌లో హెలిప్యాడ్ వద్ద రాయిని తొలగించడానికి రూ.12 లక్షలు ఖర్చయ్యిందని అధికారులు చూపిన లెక్కలపై సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయి పరిశీలన జరపాలని నిర్ణయిస్తూ ఈ అంశాన్ని వాయిదా వేశారు. అలాగే, బీచ్ రోడ్డులో ఫుట్‌పాత్ పెయింటింగ్‌లకు అయిన ఖర్చుపై కూడా మేయర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.
సిల్వర్ స్పూన్ కాంట్రాక్ట్ రద్దు
బీచ్ రోడ్డులోని సిల్వర్ స్పూన్ రెస్టారెంట్..అనుమతికి మించి 367 చదరపు గజాల స్థలాన్ని అదనంగా ఆక్రమించిందని తేలడంతో, ఆ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. ఇకపై ఆ ప్రాంతాన్ని జీవీఎంసీయే నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అధికారుల తీరుపై మేయర్ ఫైర్
స్థాయీ సంఘం దృష్టికి తీసుకురాకుండానే అధికారులు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, కమిటీకి విలువ ఇవ్వడం లేదని మేయర్ పీలా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదు.. కమిషనర్ వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుంది?’ అని ఆయన అధికారులను హెచ్చరించారు. ఈ సమావేశంలో మొత్తం 257 సాధారణ అజెండా అంశాలు, 30 టేబుల్ అజెండా అంశాలు చర్చకు రాగా.. 34 వివాదాస్పద అంశాలను పక్కనబెట్టారు. ఒక అంశాన్ని రద్దు చేశారు. మిగిలిన అంశాలకు సంఘ సభ్యులు ఆమోదం తెలిపారు.


