సైడ్ లైట్స్
●వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ– వీడీసీఏ స్టేడియం టీమిండియాకు మరోసారి కలిసొచ్చింది. విశాఖ వేదికగా భారత్‌కు ఇది 8వ విజయం కావడం విశేషం.
●ఎట్టకేలకు 20 వన్డేల తర్వాత భారత్ టాస్ నెగ్గింది. టీమ్ అనలిస్ట్ హరి సూచన మేరకు తాను ఎడమ చేత్తో కాయిన్ ఎగరేసి టాస్ గెలిచినట్లు కెప్టెన్ కె.ఎల్ రాహుల్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.
●ఛేజింగ్‌లో యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. తన కెరీర్‌లో తొలి వన్డే సెంచరీని విశాఖలో నమోదు చేసి, జట్టు విజయానికి బాటలు వేశాడు.
●రోహిత్ మెరుపు ఆరంభం ఇవ్వగా, చివర్లో కోహ్లీ తనదైన శైలిలో అర్ధ సెంచరీ పూర్తి చేసి, విన్నింగ్ షాట్‌తో మ్యాచ్‌ను, సిరీస్‌ను భారత్ వశం చేశాడు.
●డికాక్ (106) సెంచరీతో దక్షిణాఫ్రికా 168/2తో పటిష్టంగా ఉన్నా.. భారత బౌలర్లు పుంజుకున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలంతో సఫారీలను 270 పరుగులకే కట్టడి చేశారు.
●టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పుట్టిన రోజు సందర్భంగా మైదానంలోనే జట్టు సభ్యులు సంబరాలు జరిపారు.
●రోహిత్, కోహ్లీపై అభిమానంతో ఫ్యాన్స్ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ‘రో–కో’ నినాదాలతో స్టేడియం హోరెత్తింది.
●మ్యాచ్ జరుగుతుండగా ప్రేక్షకులంతా తమ సెల్‌ఫోన్ ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి స్టేడియంలో సరికొత్త కాంతులు నింపారు.
●స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, జీవీఎంసీ సహకారంతో ఏర్పాటు చేసిన ‘ఎకో ఫ్రెండ్లీ సెల్ఫీ పాయింట్’ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు.
●ఉదయం 9 గంటల నుంచే అభిమానులు స్టేడియం వద్దకు పోటెత్తారు. టికెట్ ఉన్న వారిని మాత్రమే అనుమతించేలా పోలీసులు పటిష్టమైన బారికేడ్లు, బందోబస్తు ఏర్పాటు చేశారు.
– విశాఖస్పోర్ట్స్/ పీఎంపాలెం


