సమర్థంగా ఓటర్ల జాబితా మ్యాపింగ్
మహారాణిపేట: ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడేందుకు.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధానాల ప్రకారం జిల్లాలో ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాలో పర్యటించిన ఆయన, కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, ఈఆర్వోలు, ఏఆర్వోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ముందస్తు ఎస్‌ఐఆర్ నేపథ్యంలో అధికారులు ఒత్తిడికి గురికాకుండా, బాధ్యతయుతంగా, ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వర్తించాలి. ఓటర్ల పేర్లు, వారి తల్లి/తండ్రి పేర్లను ధ్రువీకరించడానికి 2002 నాటి ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకోవాలి. 2002 జాబితాను ప్రస్తుత 2025 జాబితాతో సరిపోల్చి వివరాలను నమోదు చేయాలి. ఆయా పోలింగ్ స్టేషన్లు, నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలను మ్యాపింగ్ చేయాలి. ఈ ప్రక్రియలో స్వీయ పత్రాల స్వీకరణ పారదర్శకంగా జరిగేలా చూడాలి. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి.’అని ఆదేశించారు.
24.54శాతం మ్యాపింగ్ పూర్తి
జిల్లాలో మొత్తం 20,20,726 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ హరేందిర ప్రసాద్ వెల్లడించారు. ఇప్పటివరకు 2,81,415 మంది వివరాలను మ్యాపింగ్ చేశామని, ఇది మొత్తం ప్రక్రియలో 24.54 శాతమని వివరించారు. వారసులు, ఇతర కుటుంబ సభ్యుల వివరాలను కూడా జాగ్రత్తగా అనుసంధానం చేస్తున్నామన్నారు. అయితే జిల్లాలో అధిక భాగం పట్టణ ప్రాంతాలు కావడం, వలస కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో వివరాల సేకరణ కొంత క్లిష్టంగా మారుతోందని ఈఆర్వోలు తెలిపారు.


