సముద్రంలో పదో తరగతి విద్యార్థి గల్లంతు
పరవాడ: ముత్యాలమ్మపాలెం తీరం వద్ద సముద్రంలో ఈతకు వెళ్లిన కశింకోట మండలం తోటకూరవానిపాలేనికి చెందిన సూరెడ్డి భాను ప్రసాద్(15) గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ ఆర్.మల్లికార్జునరావు ఘటనా స్థలికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలను తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలివి.. భానుప్రసాద్ తానాం ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ తానాం జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. తన నలుగురు స్నేహితులైన ఎస్.రామచంద్ర(అనకాపల్లి మండలం వల్లూరు), మర్లపల్లి సిద్ధు(అచ్యుతాపురం మండలం మడుతూరు), ఆర్.దుర్గాప్రసాద్(పరవాడ మండలం తానాం), మొల్లి చందు(అనకాపల్లి మండలం కొత్తూరు)లతో కలిసి శనివారం ఉదయం హాస్టల్ నుంచి బయలుదేరాడు. 9.30 గంటలకు ముత్యాలమ్మపాలెం తీరానికి చేరుకొని అందరూ సముద్రంలో ఈతకు దిగారు. కొంత సేపటికి భాను ప్రసాద్‌ను బలమైన కెరటం లోపలకు లాక్కుపోయింది. తమ స్నేహితుడిని రక్షించడానికి మిగిలిన వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కెరటాల ఉధృతికి భానుప్రసాద్ లోపలికి కొట్టుకుపోయాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లికార్జునరావు చెప్పారు.
సముద్రంలో పదో తరగతి విద్యార్థి గల్లంతు


