వేటే!
కేసు పెడితే
కూటమి నేతలు మద్యం సేవించి వాహనాలు నడిపినా కేసులు పెట్టవద్దా? తాగి తందనాలాడినా అటువైపు చూడొద్దా? ఒక వేళ కేసు నమోదు చేసినా కూటమి నేత అని తెలిసిన వెంటనే.. కేసు వెనక్కి తీసుకోవాలా? వాహనాన్ని ఇచ్చేసి తూచ్ అనేయాలా? లేకుంటే వెంటనే బదిలీ వేటు వేసేస్తారా? తాజాగా స్టీల్ ప్లాంట్ ట్రాఫిక్ ఎస్‌ఐ సురేష్ బదిలీ వ్యవహారాన్ని గమనిస్తే ఇదే అర్థమవుతోంది.
● డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు తీసేయడం కుదరదన్న స్టీల్‌ప్లాంట్ ట్రాఫిక్ ఎస్‌ఐ సురేష్
● 2 గంటలపాటు ఎస్‌ఐతో పరవాడ మండల టీడీపీ అధ్యక్షుడు వాగ్వాదం
● రంగంలోకి దిగిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే అనధికారి ఓఎస్‌డీ.. ఎస్‌ఐ బదిలీ
● అవినీతి ఆరోపణలతోనే ఎస్‌ఐ బదిలీ అంటున్న పోలీస్ కమిషనర్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినందుకు ట్రాఫిక్ ఎస్‌ఐపై సరెండర్ వేటు వ్యవహారం ఇప్పుడు పోలీసు వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. స్టీల్ ప్లాంట్ ట్రాఫిక్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేసే ఎస్.సురేష్ విధుల్లో భాగంగా శుక్రవారం రాత్రి దేశపాత్రునిపాలెం సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. టీడీపీ పరవాడ మండల అధ్యక్షుడు చిన్న మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో అడ్డంగా దొరికిపోయారు. అయితే కేసు నమోదు చేయవద్దంటూ ఎస్‌ఐతో ఆయన వాదనకు దిగినట్టు తెలుస్తోంది. అప్పటికే పరీక్ష చేయడంతో నేరుగా సమాచారం పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళుతుందని.. కేసు పెట్టకుండా చేయడం సాధ్యం కాదని వివరించినట్టు సమాచారం. అధికార పార్టీకి చెందిన తనపైనే కేసు ఎలా నమోదు చేస్తారంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. సుమారు రెండు గంటలపాటు వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. అదే సామాజికవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే అనధికారి ఓఎస్‌డీగా ఉన్న బంధువు రంగంలోకి దిగి సదరు ఎస్‌ఐను బదిలీ చేయాలంటూ ఒత్తిళ్లు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సదరు ఎస్‌ఐను విశాఖపట్నం రేంజ్‌కు బదిలీ చేసినట్టు తెలుస్తోంది.
కనీస విచారణ చేయకుండా..!
ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల సందర్భంగా ఏదైనా సమస్య ఉంటే.. ఎస్‌ఐ ప్రవర్తన వ్యవహారంలో ఫిర్యాదులు వస్తే విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎస్‌ఐ సురేష్ వ్యవహారంలో అటువంటి విచారణ ఏదీ జరగలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తప్పతాగి వాహనం నడిపిన అధికారపార్టీ నేత ఫిర్యాదుతో ఏకంగా ఎస్‌ఐపై బదిలీ వేటు వేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే తాగిన మైకంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పలువురి జీవితాలను బలి తీసుకుంటున్నాయి. కర్నూలు జిల్లాలో 19 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఘటన కళ్ల ముందు ఇంకా కదలాడుతున్నప్పటికీ.. తాగి నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేసినందుకు ఎస్‌ఐపై చర్యలు తీసుకోవడం ద్వారా పోలీసింగ్‌పై ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అవినీతి ఆరోపణలతోనే సదరు ఎస్‌ఐపై చర్యలు తీసుకుని.. విశాఖ రేంజ్ డీఐజీకి సరెండర్ చేశామని నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి ‘సాక్షి’కి తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టినందుకు ఎస్‌ఐపై రివెంజ్
సీనియర్ ఎమ్మెల్యే అనధికారి ఓఎస్‌డీ ఒత్తిడితో గంటలోపే రేంజ్‌కు బదిలీ
గంటలోనే వేటు..!
డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ పరవాడ మండల అధ్యక్షుడు చిన్న పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగడంతోపాటు అధికార పార్టీకి చెందిన నేతనే అడ్డుకుంటావా అని చిందులు వేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేస్తే నీ అంతుచూస్తానని బెదిరించినట్లు సమాచారం. సదరు ఎస్‌ఐ కేసు తీసేయడం కుదరదని ఖరాఖండిగా తేల్చిచెప్పడంతో తమ సామాజికవర్గానికే చెందిన ఎమ్మెల్యే అనధికారి ఓఎస్‌డీగా వ్యవహరిస్తున్న బంధువుకు విషయం చేరవేసినట్టు సమాచారం. సదరు అనధికార ఓఎస్‌డీ రంగంలోకి దిగి గంటలోనే ఎస్‌ఐను విశాఖపట్నం రేంజ్‌కు బదిలీ చేయించినట్టు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన నేతలపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైతే బదిలీ బహుమానంగా ఇస్తారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కొద్దిరోజుల క్రితం సదరు సీనియర్ ఎమ్మెల్యే కుటుంబ కార్యక్రమానికి అనధికార ఓఎస్‌డీ భారీగా దండుకున్నారనే ఆరోపణలపై దూరంగా ఉంటున్నారనే ప్ర చారం జరుగుతోంది. తాజా వ్యవహారంతో ఇప్పటికీ సదరు అనధికార ఓఎస్‌డీ చక్రం తిప్పుతున్నట్టు అర్థమవుతోంది.
వేటే!


