తగ్గని గోస్తనీ ఉధృతి
ముంపులోనే
టి.నగరపాలెం
తగరపువలస: గోస్తనీ నది గురువారం కూడా ఉధృతంగా ప్రవహించింది. తాటిపూడి రిజర్వాయర్ నుంచి మంగళవారం 9,114 క్యూసెక్కులు, గురువారం 5 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. మరో రెండు రోజుల పాటు 5వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయనున్నారు. దీంతో గోస్తనీ నది పరీవాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గోస్తనీ నది ప్రవాహానికి టి.నగరపాలెంలోకి భారీ వరద నీరు చేరింది. పంచాయతీలో గొల్లలపాలెం వెళ్లే రహదారితో పాటు శివాలయం ముంపునకు గురయ్యాయి. దీంతో భీమిలి తహసీల్దార్ పైల రామారావు పర్యవేక్షణలో సిబ్బంది పొక్లెయిన్‌తో తాత్కాలిక కాలువలు తవ్వి నీటిని గోస్తనీ నదిలోకి పంపించారు. తాటితూరు ఆంజనేయస్వామి కూడలిలో బుధవారం నాటి ప్రవాహానికి అప్రోచ్ రోడ్డు కోతకు గురైంది. పంచాయతీలో చాలా వరకు గింజ పట్టిన వరి పంట నేలపాలైంది. తాటితూరు నుంచి బయటకు వెళ్లే రహదారులు, కల్వర్టులు బలహీనంగా ఉండటంతో ఆర్‌అండ్‌బీ అధికారులు పలు చోట్ల హెచ్చరికల బోర్డులు పెట్టారు. కొయ్యవారి కల్లాలకు చెందిన కాకర వెంకట అప్పారావు ఇల్లు తుపానుకు కూలిపోయింది. జీవీఎంసీ భీమిలి జోన్ సబ్బివానిపేట సర్వీస్‌రోడ్డులో వరద నీరు ప్రవహిస్తుండటంతో సిటీ బస్సులను తగరపువలస అంబేడ్కర్ కూడలి మీదుగా కాకుండా వెంకటేశ్వరమెట్ట వద్ద జాతీయ రహదారి మీదుగా మళ్లించారు. ఆనందపురం మండలం శిర్లపాలెం, పేకేరు పంచాయతీల మధ్య 33 ఏళ్ల నాటి కల్వర్టు తుపానుకు కొట్టుకుపోవడంతో రూ.2 లక్షలతో తాత్కాలికంగా పునరుద్ధరిస్తున్నారు. రూ.8 లక్షలతో శాశ్వత ప్రాతిపదికన దీని పునర్నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
తగ్గని గోస్తనీ ఉధృతి
తగ్గని గోస్తనీ ఉధృతి
తగ్గని గోస్తనీ ఉధృతి
తగ్గని గోస్తనీ ఉధృతి
తగ్గని గోస్తనీ ఉధృతి


