హెచ్‌ఆర్‌ఏ పునరుద్ధరణ ఎప్పుడు? | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఆర్‌ఏ పునరుద్ధరణ ఎప్పుడు?

Oct 31 2025 7:20 AM | Updated on Oct 31 2025 7:20 AM

హెచ్‌ఆర్‌ఏ పునరుద్ధరణ ఎప్పుడు?

హెచ్‌ఆర్‌ఏ పునరుద్ధరణ ఎప్పుడు?

● ఆర్థికంగా నష్టపోతున్న స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు ● యాజమాన్యంపై కార్మిక సంఘాల ఒత్తిడేది?

ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు కోల్పోయిన ఇంటి అద్దె భత్యం(హెచ్‌ఆర్‌ఏ) పునరుద్ధరణ కోసం నిరీక్షిస్తున్నారు. ప్రతి నెలా కనీసం రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ కీలక అంశానికి సంబంధించి యాజమాన్యంపై ఉక్కు అధికారుల సంఘం, కార్మిక సంఘాలు గట్టిగా ఒత్తిడి తీసుకురాకపోవడం పట్ల ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత ఏడాది స్టీల్‌ప్లాంట్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టినప్పుడు.. యాజమాన్యం అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కొన్ని ఆర్థిక ప్రయోజనాలకు కోత విధించింది. మొదట్లో 50 శాతం జీతం మాత్రమే చెల్లించడం ప్రారంభించారు. ఆ తర్వాత క్రమంగా 65 శాతం, ఒక్కోసారి 75 శాతం జీతం చెల్లిస్తూ.. మిగిలిన మొత్తాన్ని బకాయిలుగా చూపించారు. ఆ సమయంలో కార్మికులకు బేసిక్‌, డీఏ తర్వాత అతిపెద్ద కాంపొనెంట్‌గా ఉన్న హెచ్‌ఆర్‌ఏను పూర్తిగా నిలిపివేశారు. దాని ఫలితంగా, సగటు కార్మికుడు నెలకు రూ.12 వేల నుంచి రూ.18 వేలు చొప్పున, వెరసి సంవత్సరానికి సుమారు రూ.లక్షన్నర నుంచి రూ.రెండు లక్షల వరకు నష్టపోయారు. ఆ సమయంలో కార్మిక సంఘాలు అనేక ఆందోళనలు నిర్వహించాయి. ఈ క్రమంలో రీజినల్‌ లేబర్‌ కమిషనర్‌ (ఆర్‌ఎల్‌సీ) సమక్షంలో జరిగిన చర్చల్లో, ప్లాంట్‌ పరిస్థితి మెరుగుపడినప్పుడు హెచ్‌ఆర్‌ఏను పునరుద్ధరిస్తామని, బకాయిలు కూడా చెల్లిస్తామని యాజమాన్యం అంగీకరించింది.

లాభాల బాట పట్టినా...

స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగుల కష్ట ఫలితంగా, మూడు బ్లాస్ట్‌ఫర్నేస్‌లు ప్రారంభమై ప్రస్తుతం 90 శాతం ఉత్పత్తి సామర్థ్యంతో ముందుకు సాగుతున్నాయి. రెండు ఫర్నేస్‌లు ప్రారంభించిన నాటి నుంచి వెనుదిరిగి చూడకుండా కొన్ని నెలలు లాభాలు కూడా వచ్చాయి. మూడవ ఫర్నేస్‌ కూడా విజయవంతంగా కొనసాగుతుండటంతో, ఈ నెల నుంచి మరింత లాభాలు సాధించగలమని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఉద్యోగుల ఆర్థిక సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయాయి. 13 నెలల తర్వాత ఉద్యోగులు నూరు శాతం జీతం అందుకున్నప్పటికీ.. వారి వేతన బకాయిలు మాత్రం 355 శాతానికి చేరుకున్నాయి. ఇదిలా ఉండగా ప్లాంట్‌ పరిస్థితి మెరుగుపడితే హెచ్‌ఆర్‌ఏను పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని యాజమాన్యం నిలబెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సెయిల్‌తో సమానంగా 2017 నుంచి జరగాల్సిన వేతన ఒప్పందం జరగకపోవడంతో ఇప్పటికే వేల రూపాయలు ఆర్థికంగా నష్టపోతున్న కార్మికులు.. ఇప్పుడు హెచ్‌ఆర్‌ఏను కూడా పొందలేకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంఘాల వైఫల్యంపై

ఉద్యోగుల ఆగ్రహం

ఈ ముఖ్యమైన విషయంలో యాజమాన్యంతో నిరంతరం చర్చించి ఒప్పించాల్సిన అధికారుల అసోసియేషన్‌, కార్మిక సంఘాలు విఫలమయ్యాయని చెప్పాలి. ముఖ్యంగా గుర్తింపు సంఘం నుంచి ఎటువంటి స్పందన రావడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. గుర్తింపు సంఘం ఇతర కార్మిక సంఘాలను కలుపుకుని యాజమాన్యంతో చర్చించి, తక్షణమే హెచ్‌ఆర్‌ఏ పునరుద్ధరణకు కృషి చేయాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement