కై లాసగిరి ఘాట్‌లో విరిగిపడిన కొండచరియలు
ఆరిలోవ: మోంథా తుపాను ప్రభావం ప్రముఖ పర్యాటక కేంద్రమైన కై లాసగిరిని కూడా తాకింది. నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కై లాసగిరి ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన వాహనాల రాకపోకలు లేని తెల్లవారుజామున జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వరుస వర్షాలకు ఘాట్ రోడ్డు అంచులు బాగా నానిపోయాయి. గురువారం వేకువజామున కురిసిన వర్షానికి కొండ అంచుల్లోని మట్టి, రాళ్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. కొన్ని చోట్ల మట్టి గుట్టలుగా జారిపడగా.. మరికొన్ని చోట్ల పెద్ద పెద్ద బండరాళ్లు సైతం రోడ్డు మధ్యలోకి దొర్లాయి. గురువారం ఉదయం విధులకు వెళ్లిన సిబ్బంది వెంటనే స్పందించి.. అడ్డుగా పడిన బండరాళ్లను, మట్టిని తొలగించి రోడ్డును కొంతవరకు శుభ్రం చేశారు. రాళ్లను రోడ్డు అంచున కుప్పలుగా వేశారు. ప్రస్తుతం ఘాట్ రోడ్డులోని మలుపుల వద్ద కొండ అంచులు ఇంకా బలహీనంగా, ఊగుతున్నట్లుగా కనిపించడం పర్యాటకులను, సిబ్బందిని కలవరపరుస్తోంది. అధికారులు తక్షణమే ఘాట్ రోడ్డులో భద్రతా చర్యలు చేపట్టాలని సందర్శకులు కోరుతున్నారు.
బీచ్‌రోడ్డులో..
అలాగే బీచ్‌రోడ్డులోని సీతకొండ మలుపు, తెన్నేటి పార్కు, కై లాసగిరి కొండ మలుపు వద్ద మట్టితో రాళ్లు జారిపడ్డాయి. సీతకొండ మలుపు వద్ద సుమారు 20 మీటర్ల వరకు పెద్ద బండలు ఫుట్‌పాత్ నుంచి రోడ్డు మధ్య వరకు చేరాయి. వాటిని జీవీఎంసీ సిబ్బంది తొలగించి కొండ అంచున కుప్పగా వేశారు. మలుపు వద్ద కొంత ఎత్తులో రక్షణ గోడ నిర్మించాలని వాహనచోదకులు, స్థానికులు కోరారు.
కై లాసగిరి ఘాట్‌లో విరిగిపడిన కొండచరియలు


