తుపాను తదుపరి చర్యలపై దృష్టి సారించండి
కలెక్టర్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట : మోంథా తుపాను నష్టాలను జాగ్రత్తగా అంచనా వేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా తుపాను అనంతరం తీసుకోవలసిన చర్యలపై జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, జోనల్ అధికారులు, రెవెన్యూ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పారిశుధ్యం, నీటి వనరుల క్లోరినేషన్, దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణపై జోనల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న గృహాలను నమోదు చేయాలని, పంట, పశు నష్టం, బోట్ల నష్టం అంచనాలను తయారు చేయాలన్నారు. దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లు, భవనాలు, మైనర్ ఇరిగేషన్, పాఠశాలల భవనాలు అంచనాలు తయారు చేయాలని, నిరాశ్రయులైన వారికి, తుపాను వల్ల ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను గుర్తించి పరిహారం అందించడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. నష్టం అంచనాలను గురువారం సాయంత్రానికి పూర్తి చేయాలని ఆదేశించారు. తుపాను వల్ల నిరాశ్రయులైన వారికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటర్ ఆయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళ దుంపలు, కేజీ పంచదార ఇవ్వాలని, మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల బియ్యం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. నిరాశ్రయులై రిలీఫ్ కేంద్రాలకు వచ్చిన వారికి ఒక్కరికి వెయ్యి రూపాయలు, ఒక కుటుంబంలో గరిష్టంగా రూ.3 వేలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు.


