గోస్తనీ ఉగ్రరూపం
తగరపువలస: తాటిపూడి రిజర్వాయర్ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో గోస్తనీ నది ఉగ్రరూపం దాల్చింది. భీమిలి డివిజన్‌లోని తగరపువలస, పరిసర ప్రాంతాలు బుధవారం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా భీమిలి మండలం పెదనాగమయ్యపాలేనికి మూడు అడుగుల మేర వరద నీరు పోటెత్తడంతో అతలాకుతలమైంది. తీరంలో ఉంచిన బోట్లు, వలలు నీట మునిగాయి. పెదనాగమయ్యపాలెంలోని 0327044 నంబరు రేషన్ డిపో గొడౌన్‌లోకి నీరు చేరింది. గొడౌన్‌లోని మొత్తం 400 బియ్యం బస్తాలకు గాను 120 బస్తాలు పూర్తిగా తడిచిపోయాయి. నీరు చేరిన సమయంలో అక్కడ 400 పంచదార ప్యాకెట్లు కూడా ఉన్నట్లు తెలిసింది. బియ్యం బస్తాలు నీట మునగడంతో నిరుపేదలకు రేషన్ పంపిణీకి ఆటంకం కలిగింది. వరద ప్రభావంతో తగరపువలస నుంచి పలు ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మహరాజుపేట–పద్మనాభం రహదారిపై మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. తాటితూరులోని తాటాకు ఇళ్లలోకి వరదనీరు చేరడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నవరం వెళ్లే మార్గంలో ఉప్పుటేరు నీరు భారీగా చేరింది. దీంతో దివీస్ పరిశ్రమ ఉద్యోగులతో పాటు చిప్పాడ, తూడెం, గుడివాడ వంటి గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయరహదారి నుంచి భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండలాలను కలిపే మార్గంలోని శివాలయం వద్ద చప్టా పూర్తిగా మునిగిపోయింది. ఈ ప్రవాహంలో ఒక పాడి ఆవు కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. టి.నగరపాలెంలో స్నానాల ఘాట్ పూర్తిగా నీట మునిగింది.
గోస్తనీ ఉగ్రరూపం
గోస్తనీ ఉగ్రరూపం


