ఉపాధి కూలీలకు ఈకేవైసీ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీలకు ఈకేవైసీ కష్టాలు

Oct 30 2025 7:31 AM | Updated on Oct 30 2025 7:31 AM

ఉపాధి కూలీలకు ఈకేవైసీ కష్టాలు

ఉపాధి కూలీలకు ఈకేవైసీ కష్టాలు

● నవంబర్‌ 1 నుంచి పనులు ప్రశ్నార్థకం ● ఆందోళనలో ఈకేవైసీ పూర్తికాని ఉపాధి కూలీలు

మహారాణిపేట: జిల్లాలో ఉపాధి హామీ పథకం కూలీల ఈకేవైసీ(ఎలక్ట్రానిక్‌ నో యువర్‌ కస్టమర్‌) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. నవంబర్‌ 1వ తేదీ నుంచి ఈకేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే పనులు కల్పించి, మస్టర్‌ వేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే గడువు ముగియడానికి కేవలం రెండు రోజులే మిగిలి ఉన్నా.. జిల్లాలో ఇప్పటివరకు కేవలం 80 శాతం మాత్రమే ఈకేవైసీ పూర్తయింది.

జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి మొత్తం 3.65 లక్షల మందికి జాబ్‌ కార్డులు ఉన్నాయి. అయితే వారిలో 2.89 లక్షల మంది మాత్రమే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు. ఇంకా సుమారు 76 వేల మంది కూలీల ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. మిగిలిన రెండు రోజుల్లో 100 శాతం లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. నవంబర్‌ ఒకటో తేదీ నుంచి ఈకేవైసీ పూర్తి అయిన వారికే మస్టర్‌ వేస్తారు. వాస్తవంగా హాజరైన కూలీల వేలిముద్ర లేదా కంటి పాపలు(ఐరిష్‌) ఆధారంగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇంత ప్రాధాన్యత కలిగిన ఈకేవైసీ జిల్లాలో లక్ష్యానికి ఇంకా చేరుకోలేదు. ఈ జాప్యానికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ) అధికారుల అలసత్వమే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

అవినీతికి అడ్డుకట్ట వేసేందుకే..

ఉపాధి హామీ పథకంలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. చాలా చోట్ల కూలీలు పనులకు రాకపోయినా వచ్చినట్టు చూపుతున్నారు. కొన్ని చోట్ల చనిపోయిన వారి పేర్లు, దేశంలో ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల్లో ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటున్న వారి పేర్లతో మస్టర్లు వేస్తున్నారు. ఇలా క్షేత్ర స్థాయిలోనే సిబ్బంది, అధికార పార్టీ నాయకులు ఆయా మొత్తాలను స్వాహా చేస్తున్నారు. స్థానిక నాయకులు చెప్పినట్లు ఫీల్డ్‌ అసిస్టెంట్లు నకిలీ ఫొటోలు అప్‌లోడ్‌ చేసి వేతనాలు పొందుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అవినీతికి అడ్డుకట్ట వేసేందుకే కేంద్రం ఈకేవైసీని తప్పనిసరి చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, ఆధార్‌తో అనుసంధానమైన ఈకేవైసీ పూర్తి చేసి, ప్రతిరోజూ రెండు పూటలా పని ప్రదేశంలో ముఖ గుర్తింపు (ఫొటో) ద్వారా హాజరు నమోదు చేసుకోవాలి. అయితే, అధికారుల నిర్లక్ష్యం కారణంగా గడువులోగా ఈకేవైసీ పూర్తికాని వేలాది మంది నిజమైన కూలీలు, నవంబర్‌ 1 నుంచి ఉపాధి కోల్పోతామేమోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement