పునరావాస కేంద్రంలో చిమ్మచీకట్లు
కొమ్మాది: జీవీఎంసీ 4వ వార్డు మంగమారిపేట వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో విద్యుత్ సౌకర్యం లేక చిమ్మచీకట్లు అలముకున్నాయి. గతంలో మంగమారిపేటలో తుపాను రక్షిత భవనం ఉండేది. అయితే అది పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరుకోవడంతో.. జిల్లా పరిషత్ హైస్కూల్‌ను సోమవారం తాత్కాలిక పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఈ హైస్కూల్ భవనంలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో పాటు ప్రధానంగా చీకట్లు అలుముకోవడంతో.. తీరప్రాంత మత్స్యకారులు అక్కడి నుంచి వెనుతిరిగారు. అధికారుల తీరుపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాగా.. పునరావాస కేంద్రం కోసం జనరేటర్‌ను ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు దానిని ఉపయోగించడం లేదు. దీనిపై అధికారులను ప్రశ్నించగా.. ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తే జనరేటర్ ఆన్ చేస్తామని చెప్పడం గమనార్హం.


