విశాఖపై పంజా
● జీవీఎంసీ 12వ వార్డు పరిధిలోని బీసీకాలనీ కొండవాలు ప్రాంతంలో రక్షణ గోడ, రహదారి కూలిపోయింది.
● 13వ వార్డు శ్రీకృష్ణాపురంలో ఖాళీ స్థలం చుట్టూ ఉన్న రక్షణ గోడ కూలిపోయింది. చెట్టు నెలకొరిగింది.
● 34వ వార్డు కొబ్బరితోట, తారకరామ కాలనీల్లో రెండు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
● 40వ వార్డు రాజీవ్‌కాలనీ సుమారు 3 అడుగుల మేర నీట మునిగింది. నౌసేనాభాగ్, మల్కాపురం, మల్కాపురం మరిడిమాంబ కల్యాణమండపం, పల్లివీధి, సులభ్ కాంప్లెక్స్ ఏరియా, ఎంఈఎస్ క్వార్టర్స్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి.
● యారాడ ఘాట్ మార్గంలో తొలి మలుపు వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి.
● గురుద్వారా సమీపంలోని దీపక్ పంజాబీ ధాబా వద్ద పెద్ద చెట్టు కూలిపోవడంతో ట్రాఫిక్‌కు స్వల్ప అంతరాయం కలిగింది.
● గురుద్వారా కూడలి సమీపంలో గెడ్డపై ఉన్న రహదారి, కల్వర్టు, రిటైనింగ్ వాల్ కుంగిపోయాయి. రహదారి దెబ్బతిని పెద్ద గొయ్యి ఏర్పడింది.
● 51వ వార్డులోని మాధవస్వామి ఆలయంలో జలధార ఉప్పొంగింది. మాధవస్వామి ఆలయం, శివాలయం ప్రాంగణాలు పూర్తిగా నీట మునిగాయి.
● 4వ వార్డులో హైవే నుంచి పరదేశిపాలెం మీదుగా కాపులుప్పాడకు వెళ్లే మార్గమధ్యలో గెడ్డపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
● పరదేశిపాలెం నుంచి డంపింగ్ యార్డుకు వెళ్లే మార్గంలో వరద నీరుతో రాకపోకలు నిలిచిపోయాయి.
● సాగర్‌నగర్, రుషికొండ, మంగమారిపేట, భీమిలి బీచ్ పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.
● గోస్తనీ నదిలోకి గెడ్డలు, వాగుల ద్వారా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో నది నిండుగా కనిపిస్తోంది.
● 5వ వార్డు బోయిపాలెం సమీపంలోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పీపీ 2 కాలనీలో 4 బ్లాకుల్లో ఉన్న సుమారు 100 ఇళ్లు వరద నీటిలో చిక్కుకున్నాయి. పక్కనే ఉన్న గెడ్డ పొంగడంతో నీరు నివాసాల్లోకి చేరింది. ● తుమ్మిరిగెడ్డ మినీ రిజర్వాయర్ నిండుగా కనిపిస్తోంది.
● అనంతవరం సమీపంలో గెడ్డ పక్కన ఉండే అప్రోచ్ రోడ్డు వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయింది. గంథవరం ప్రజలు కొత్తకొవ్వాడ, పెంట, అనంతవరం రోడ్డు మీదుగా పద్మనాభం చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
● గాజువాకలోని 70వ వార్డులో దశమికొండ కాలనీ, చిట్టినాయుడు కాలనీ, డ్రైవర్స్ కాలనీ కొండవాలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి.
● కృష్ణానగర్ ప్రాంతంలో రెండు ఇళ్లపైన, పెంటయ్యనగర్ కొండపై మూడు ఇళ్లపైన మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి.
● 87వ వార్డులోని సిద్ధార్థనగర్, టిజిఆర్ నగర్‌ల మధ్య గల రహదారిలో నిలువెత్తు నీరు చేరడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
● 77వ వార్డు అప్పికొండ సమీపంలోని వెలమపేట నీట మునిగింది.
● 64వ వార్డు పరిధిలోని గంగవరం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తోంది.
● గుల్లేపల్లి–సబ్బవరం రోడ్డులో ఆదిరెడ్డిపాలెం వద్ద ఉన్న కాజ్‌వే పైనుంచి భారీగా నీరు ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
● ఎంవీపీ కాలనీ సెక్టార్–9 అప్పుఘర్ గొల్లవీధి రహదారిలో చెట్టు విరిగిపడటంతో ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. లాసన్స్ బే కాలనీలో కారు తీవ్రంగా దెబ్బతింది.
● జీవీఎంసీ 16వ వార్డు హెచ్‌బీ కాలనీ జంక్షన్‌లో హౌసింగ్ బోర్డు నిర్మిస్తున్న దుకాణ సముదాయం కోసం తవ్విన గోతిలో.. దానికి ఆనుకుని ఉన్న ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ స్తంభాలు జారి పడిపోయాయి. మరో రెండు విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపోయాయి.
● దువ్వాడలోని వీఎస్‌ఈజెడ్ సబ్‌స్టేషన్‌కు అనుసంధానం చేసే 33కేవీ కండక్టర్ తెగిపడటంతో జంపర్లు ఊడిపోయాయి.
● భీమిలి మండలం టి.నగరపాలెం వద్ద హైవేతో పాటు సర్వీస్ రోడ్లపై మూడు అడుగుల మేర వరద నీరు చేరడంతో వాహనాలకు తీవ్ర అంతరాయం కలిగింది.
● ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ మిందివానిపాలెం, వెల్లంకి పంచాయతీల్లో వరద నీరు హైవేతో పాటు సర్వీస్ రోడ్ల మీదుగా ప్రవహిస్తోంది.
● గాజువాక–సింథియా ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది.
● గొట్టిపల్లి అంగన్‌వాడీ కేంద్రంలోకి నీరు ప్రవేశించింది. సరుకులు, రికార్డులు, ఫర్నిచర్ నీటిలో తడిచిపోయాయి.
● తాటితూరు, దత్తప్ప చెరువులు నిండిపోవడంతో ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
● గొరపల్లి, పురుషోత్తపురం, చీమలాపల్లి, రాంపురం, అక్కిరెడ్డిపాలెం ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి.
● పెందుర్తి, సబ్బవరం ప్రాంతాల్లో వందలాది ఎకరాల పంట భూమిలోకి నీరు చేరింది.
విశాఖపై పంజా


