గరిష్ట స్థాయికి మేహాద్రి నీటిమట్టం
రికార్డు స్థాయిలో
9,200 క్యూసెక్కుల నీరు విడుదల
పెందుర్తి : మేహాద్రిగెడ్డ జలాశయం నీటిమట్టం రికార్డు స్థాయికి చేరుకుంది. రిజర్వాయర్‌కు వస్తున్న అన్ని కాలువలు ఉధృతంగా ప్రవహించడంతో మంగళవారం రికార్డు స్థాయిలో 8 వేల క్యూసెక్కుల వరదనీరు చేరింది. దీంతో రిజర్వాయర్ నీటిమట్టం గరిష్ట(60/61)స్థాయి రెండు రోజులుగా నిలకడగా ఉంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం నుంచి నాలుగు గేట్ల ద్వారా 9,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 2021 (నవంబర్‌లో 7 వేల క్యూసెక్కులు విడుదల చేశారు) తరువాత ఈ స్థాయిలో నీటిని విడుదల చేయడం ఇదే ప్రథమం. మంగళవారం అర్ధరాత్రి నుంచి వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో రిజర్వాయర్ గేట్లు అన్నీ ఎత్తే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా మేహాద్రిని సందర్శించిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ పరిస్థితిని ఆరా తీశారు. ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లోపై సమీక్షించారు. రిజర్వాయర్ పరివాహక ప్రాంతాల్లో ఉన్న కాలనీల వాసులను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. నీటిపారుదలశాఖ ఎస్‌ఈ పి.అప్పలనాయుడు, డీఈ జె.స్వామినాయుడు, పెందుర్తి తహసీల్దార్ ఐ.వెంకటఅప్పారావు, ఏఈ పి.నళిని పాల్గొన్నారు.


