పూర్వ డీఎంహెచ్‌వో రామారావు మృతి
మద్దిలపాలెం: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పూర్వపు అధికారి డాక్టర్ పెంటకోట రామారావు (79) కన్నుమూశారు. ఆదివారం రాత్రి గుండెపోటుతో సీతమ్మధార డాక్టర్స్ కాలనీలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. డాక్టర్ రామారావు కేజీహెచ్‌లో చాలాకాలం వైద్యుడిగా సేవలు అందించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ సీనియర్ ఉద్యమనేతగా, విశాఖ కన్జ్యూమర్ కౌన్సిల్ కార్యదర్శిగా కూడా డాక్టర్ రామారావు పనిచేశారు. ఆయన మరణవార్త తెలియగానే, సీతమ్మధారలోని డాక్టర్ రామారావు నివాసానికి ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కార్యదర్శి ఎ.అజశర్మ, సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.కె.ఎస్.వి. కుమార్, పి.మణి, వి.కృష్ణారావు, ప్రజారోగ్య వేదిక నాయకులు డాక్టర్ వై.ఎల్. నర్సింగరావు, కేవీపీ చంద్రమౌళి, వార్వా నాయకులు జి.వి. రమణ, పి. లచ్చిరాజు, సీఐటీయూ మద్దిలపాలెం జోన్ కార్యదర్శి పి.వెంకటరావు తదితరులు వెళ్లి డాక్టర్ రామారావు పార్థివ దేహానికి నివాళులర్పించారు.


