వర్ష బీభత్సం
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు
మంగళవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
వేట సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళుతున్న మత్స్యకారులు
లోతట్టు ప్రాంతాలు జలమయం
పలు చోట్ల నేలకొరిగిన చెట్లు
58 పునరావాస కేంద్రాల ఏర్పాటు
మహారాణిపేట : మోంథా తుఫాన్ ప్రభావంతో సోమవారం విశాఖలో వర్షం దంచికొట్టింది. రోజంతా ఏకధాటిగా కురిసి అలజడి సృష్టించింది. జనజీవనం స్తంభించింది. రోడ్లన్నీ జలమయంగా మారాయి. వీఎంఆర్‌డీఏ పార్కు, పెదజాలారిపేట, పెదవాల్తేరు, ఎంవీపీకాలనీ తదితర ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు, చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గోపాలపట్నంలో ఒక ఇల్లు గోడ కూలింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటంతో తీరప్రాంతమంతటా అల్లకల్లోలంగా మారింది. చాలా వరకు తీరం కోతకు గురైంది. తీర ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఉద్యోగులంతా తుపాన్ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. నేడు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో మంగళవారం కూడా జిల్లాలోని అన్ని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఏయూకు సెలవులు ప్రకటించారు. కాగా మోంథా తుఫాన్ ప్రస్తుతం కాకినాడకు 450 కిలోమీటర్ల దూరంలోను విశాఖకు 500 కిలోమీటర్ల దూరంలో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది. మంగళవారం ఉదయం మోంథా తీవ్ర తుఫాన్‌గా బలపడనుంది. కాకినాడ– అమలాపురం మధ్యలో బుధవారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 110 కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పలు ప్రాంతాలు జలమయం
వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పూర్ణామార్కెట్, వెలంపేట, రామకృష్ణ థియేటర్ ఏరియా, న్యూకాలనీ, వాల్తేరు, చావులమదుం, జ్ఞానాపురం, అల్లిపురం, జాలారిపేట, బీచ్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో నీరు చెరువులను తలపిస్తోంది. చావులమదుం–కాన్వెంట్ జంక్షన్ రోడ్డులో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బీచ్‌రోడ్డులో కూడా నీరు చేరడంతో వాహనచోదకులు ఇబ్బందిపడ్డారు. అనేక ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ నుంచి నీరు పొంగి ప్రవహించింది.
పునరావాస కేంద్రాల ఏర్పాటు
కొండవాలు, పల్లపు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. జీవీఎంసీ, జిల్లాలో మొత్తం 58 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. జీవీఎంసీ పరిధిలో 38, గ్రామీణ ప్రాంతాల్లో 20 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. పునరావాస కేంద్రాలకు వచ్చే వారికి తాగునీరు, ఆహారం, మందులు, పిల్లలకు పాలు, జనరేటర్, తదితర అన్ని వసతులు కల్పిస్తున్నారు.
సోమవారం నమోదైన వర్షపాతం మండలం మొత్తం (మి.మీ) సీతమ్మధార 89.2 గాజువాక 77.4 పెదగంట్యాడ 85.2 విశాఖ (రూరల్) 86.0 భీమునిపట్నం 74.6 పద్మనాభం 30.6 ఆనందపురం 62.4 పెందుర్తి 79.9 మహారాణిపేట 86.4 గోపాలపట్నం 71,0 ములగాడ 84.6
వర్ష బీభత్సం
వర్ష బీభత్సం
వర్ష బీభత్సం
వర్ష బీభత్సం
వర్ష బీభత్సం
వర్ష బీభత్సం


