పేదలే లక్ష్యంగా కూటమి అరాచక పాలన
వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్‌రెడ్డి
వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమం
భారీ వర్షంలోనూ సంతకాల సేకరణ
గాజువాక/ మల్కాపురం : కూటమి ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా అరాచక పాలన సాగిస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు విద్య, వైద్య రంగాలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని వైఎస్సార్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పి. గౌతమ్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం సోమవారం గాజువాక, 60వ వార్డు గుల్లలపాలెంలో జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కొనసాగింది. ఇప్పటికే 50 లక్షల సంతకాలు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో భాగంగా వీఆర్‌ఎస్ ద్వారా 1,600 మంది ఉద్యోగులను, 5,500 మంది కాంట్రాక్టు కార్మికులను చట్ట వ్యతిరేకంగా తొలగించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గౌతమ్‌రెడ్డి ఆరోపించారు. పెదగంట్యాడను ఆనుకుని అదానీ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిందాల్ స్టీల్‌ప్లాంట్ రాష్ట్రం నుంచి మహారాష్ట్రకు వెళ్లిపోవడం, ఎమ్మెల్యేల ఇష్టారాజ్య వ్యవహారాలు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వంటి చర్యల వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హామీ ఇచ్చిన టీడీపీ, అధికారంలోకి వచ్చాక ప్లాంట్ కార్మికులపై ఎదురుదాడి చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్,, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి పాల్గొన్నారు.


